2023-11-20 13:15:01.0
https://www.teluguglobal.com/h-upload/2023/11/20/859106-dhipam.webp
1
వొంటి మీద
ఆ నాలుగు నీటి చుక్కలూ ఆరిపోకుండానే
నిన్నొక వూహగా పొదువుకొని
వెలిగించుకుంటానీ దీపం.
తుళ్ళి పడదు వొళ్ళు
దీపశిఖ కన్నా నిబ్బరంగా నిటారుగా వెలుగుతుంది
నీలో
నీ బయటా-
2
చీకట్లు అలవాటైన కళ్ళల్లో
నీటి చుక్క కన్నా చిక్కగా
నిలబడి వెలుగుతావ్
నువ్వొక్క దానివీ-
యే నేరమూ చెయ్యలేదని కాదు
యే నెపమూ కాలమ్మీద మోపి తప్పించుకోలేదనీ కాదు.
నీ మోహావేశం అడివిలో తుఫానులా
తుఫానులో గాలిలా
గాలిలో కొట్టుకెళ్ళిన ఎండుకొమ్మలా
అలవాటు కానివి యెన్ని నేర్పావో కదా
దీపం పెట్టినంత శుభ్రంగా తేటగా-
3
అదేదో మరుపేదో వచ్చిందనీ
యేదో వొక మెరుపై వచ్చి వెళ్ళావనీ
క్షణకాలపు వెలుగేదో వెలిగావనీ
యెవరన్నా అన్నా
ఆరిపోతాన్నేను ఖాళీ ప్రమిదలో వొలికిపోయిన నీడలా-
4
నేను చీకటీ
నువ్వు దీపమూ –
యిక
అంతే యెప్పటికీ!
– ఆఫ్సర్
Deepam Pette Vela,Telugu Kavithalu