2025-02-14 17:29:52.0
పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జీలను నియమించిన ఏఐసీసీ
https://www.teluguglobal.com/h-upload/2025/02/14/1403497-meenakshi-natarajan.webp
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీపై వేటు పడింది. ఆమె స్థానంలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ ను నియమిస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీలను మార్చారు. ఈమేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి 2009లో మందసౌర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ టీమ్‌లో కీలక నాయకురాలిగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు గాడితప్పుతున్నా దీపాదాస్ వాటిని కంట్రోల్ చేయలేకపోవడం.. కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో దీపాదాస్ పై వేటు వేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, జమ్మూకశ్మీర్ ఇన్‌చార్జీగా డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్ ఇన్‌చార్జీగా రజనీ పాటిల్, హరియాణకు బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్ కు హరీశ్ చౌదరి, తమిళనాడు, పుదుచ్ఛేరికి గిరీశ్ చోడాంకర్, ఒడిశాకు అజయ్ కుమార్ లల్లూ, జార్ఖండ్ కు కొప్పుల రాజు, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలకు సప్తగిరి శంకర్ ఉల్కా, బిహార్ ఇన్‌చార్జీగా కృష్ణ అల్లవారులను నియమించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటు కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ లలో అధికారంలో ఉంది. తెలంగాణ ఇన్‌చార్జీ మార్పుపై కొన్ని రోజులుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అందరు అనుకున్నట్టుగానే దీపాదాస్ మున్షీ స్థానంలో పార్టీ హైకమాండ్ కొత్త ఇన్‌చార్జీని నియమించింది.
Congress,Telangana,New Incharge,Deepadas Munshi,Meenakshi Natarajan,AICC