దుర్మార్గ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌

2025-01-07 14:20:55.0

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని ఖండించిన బీజేపీ నేతలు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుర్మార్గ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కాంగ్రెస్‌ పార్టీ.. తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు.

పోలీసులను వెంట తీసుకొచ్చి బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారని, పోలీసులు ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని హైదరాబాద్‌ సీపీని ప్రశ్నించారు. బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరని హెచ్చరించారు. రోజురోజుకూ కనుమరుగవుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. నిరాశతో భౌతిక దాడులకు దిగడాన్ని ప్రజలు క్షమించరన్నారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు, భౌతిక దాడులకు తావు లేదన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దీనిపై స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని ఖండించారు. బీజేపీ తలుచుకుంటే గాంధీభవన్‌ పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది? రాళ్ల దాడులను కాంగ్రెస్‌ ప్రోత్సహించాలనుకుంటున్నదా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించొద్దు అన్నారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఎక్కడ ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. దాడిపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ ముసుగులో దాడి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కానీ.. కాంగ్రెస్‌ పార్టీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు కోసం ఈ దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామన్నారు. 

Kishan Reddy,BJP Leadrs condemns,Attack on BJP office in Hyderabad,Youth Congress,Protest,Against Ramesh Bidhuri’s Remarks