2023-07-07 12:13:10.0
https://www.teluguglobal.com/h-upload/2023/07/07/792648-mamidala-shailaja.webp
నీ మాట ఉచ్చరించడమే
ఉద్వేగ భరితం.
నీ తలపుల మునివాకిట
విహరించడమే
ఉల్లాస పూరితం!
నరకతుల్యమైన
ప్రసవశూల వేదనను భరించి
రక్త మాంసాల కలయికతో
నా అస్తిత్వానికి రూపునిచ్చావు!
మలమూత్రాలతో మలినం చేస్తూ
నిద్రకు దూరం చేస్తున్నా
మౌనంగా సహించావు!
రాత్రి పగలు తేడా లేకుండా
స్తన్యం కోసం వేధించినా
చిరునవ్వుతో భరించావు!
నిండు వేసవిలో కూడా పాశాల పూలు పూయించావు!
కష్టాల అంధకారంలో కూరుకుపోయి నేనున్నప్పుడు
ఎక్కడెక్కడి వెన్నెలలో
వెతికి తెచ్చి నా ఒడిని నింపావు!
వాత్సల్యం జీవ లక్షణoగా ఉన్న
నీ గొప్పతనాన్ని కీర్తించడం
ఆ చతుర్ముఖ బ్రహ్మకు సాధ్యం కాదు!
సహస్ర ముఖాల ఆదిశేషునికీ అసాధ్యమే!
అలాంటి నిన్ను అంతిమ దశలో
నిర్లక్ష్యం చేసి అలా? అమ్మా?
అనే విచికిత్సకు లోనయ్యే దుస్థితిలో ఉన్న ఈ దౌర్భాగ్యపు సంతానానికి మన్నింపు అనేది
దుస్సాధ్యమే కదా అమ్మా!
-మామిడాల శైలజ (వరంగల్)
Telugu Kavithalu,Mamidala Shailaja