2015-05-11 13:08:06.0
మనం రకరకాల మతాల వాళ్ళను చూస్తూ ఉంటాం. మనిషిని మనిషిగా చూస్తే ప్రపంచంలో ఎవర్నీ ఇతను ఫలానా మతం వాడని మనం గుర్తుపట్టలేం. పిలకలు ఉండడం, గడ్డం పెంచుకోవడం, మెడలో రుద్రాక్షలు, లేదా మత చిహ్నాలు వేలాడదీసుకోవడం దాన్ని బట్టి ఎవరికి వారు నేను ఫలానా మతానికి చెందినవాణ్ణి అని ప్రదర్శించుకుంటారు. ఎవరి ప్రార్థనాలయాలకు వాళ్ళు వెళతారు, ఇతర్ల మందిరాలకు వెళ్ళరు. వాళ్ళ ఉద్దేశంలో దేవుడు వాళ్ళ ప్రార్థనా […]
మనం రకరకాల మతాల వాళ్ళను చూస్తూ ఉంటాం. మనిషిని మనిషిగా చూస్తే ప్రపంచంలో ఎవర్నీ ఇతను ఫలానా మతం వాడని మనం గుర్తుపట్టలేం. పిలకలు ఉండడం, గడ్డం పెంచుకోవడం, మెడలో రుద్రాక్షలు, లేదా మత చిహ్నాలు వేలాడదీసుకోవడం దాన్ని బట్టి ఎవరికి వారు నేను ఫలానా మతానికి చెందినవాణ్ణి అని ప్రదర్శించుకుంటారు.
ఎవరి ప్రార్థనాలయాలకు వాళ్ళు వెళతారు, ఇతర్ల మందిరాలకు వెళ్ళరు. వాళ్ళ ఉద్దేశంలో దేవుడు వాళ్ళ ప్రార్థనా మందిరంలోనే ఉంటాడు. ఇతర మతస్థులు పాపులు. ప్రతిమతస్థుడూ ఇంకో మతస్థుణ్ణి అలాగే అనుకుంటారు.
హసన్ అని ఒక భక్తుడు ఉండేవాడు. నిరంతర దైవ చింతనలో నిమగ్నుడై ఉండేవాడు. డెబ్బయ్యేళ్ళపాటు ఎడతెగకుండా మసీదుకు సమయానికి వెళ్ళి ప్రార్థనలు చేసేవాడు. డెబ్బయ్యేళ్ళనించీ అతను క్రమం తప్పకుండా మసీదుకు వస్తూ ప్రార్థనలు చేస్తున్నాడని గ్రామానికంతా తెలుసు. డెబ్బయ్యేళ్ళు అతనికి మసీదుతో అనుబంధం. అతనూ, మసీదూ వేరుకాదన్నంతగా కలిసిపోయారు. హసన్ లేని మసీదును ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడూ క్రమం తప్పకుండా మసీదుకు రావడం కుదరదు. ఏవో పనుల వల్ల ఇతర ప్రాంతాలకు వెళతారు. సమయానికి అక్కడ ప్రార్థనలు జరుపుతారు. అదివేరే విషయం. కానీ అదే మసీదుకు రావడానికి వాళ్ళకు కుదరదు కదా!
కానీ హసన్ గ్రామాన్ని వదిలి వెళ్ళేవాడు కాదు. అందువల్ల మసీదుకు అనునిత్యం దర్శించేవాడు. రోజుకి ఐదుసార్లు క్రమం తప్పక నమాజు చేసేవాడు. కొన్ని సమయాల్లో అనారోగ్యం పాలయినా అతను మసీదుకు రావడం మాత్రం మానలేదు.
ఒకరోజు ఉదయాన్నే అతను మసీదులో కనిపించలేదు. అతను రాకపోవడమన్నది అసంభవం. అతను మసీదుకు రాలేదంటే అతను చనిపోయాడని అర్థం. అందరూ అతని విషయంలో అంత దృఢమైన అభిప్రాయం ఏర్పరచుకున్నారు. ప్రార్థనలు ప్రారంభమయ్యాయను కుంటే అక్కడ హసన్ ఉంటాడని అందరి నమ్మకం. ఏమైంది? నడవలేని స్థితికి చేరుకున్నాడా? ఎందుకు రాలేదు? తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడా? ఎంత ఆలోచించినా జనాలకు అంతుబట్టలేదు.
జనాలు అతన్ని వెతుక్కుంటూపోయారు. హసన్ ఒక చెట్టుకింద కనిపించాడు. ఆశ్చర్యపోయారు. ఆరోగ్యంగానే కనిపించాడు. ఎందుకని మసీదుకు రాలేదు? అతన్నే అడిగి తెలుసుకుందామనుకుని అడిగారు.
హసన్ “నేను క్రమం తప్పకుండా డెబ్బయిసంవత్సరాలు మసీదుకు వచ్చాను. ఆయన ఆలయం మినహా మరొకటి నాకు కనిపించలేదు. అందుకని వచ్చాను. అప్పటికి నాకు దేవుడుండే స్థలం ఆ మసీదు ఒక్కటే అన్న అభిప్రాయం ఉండేది. ఇప్పుడు దేవుడు మసీదులోనే కాదు, అన్ని చోట్లా ఉన్నాడని తెలుసుకున్నాను. ఆయనలేని చోటు ఏదీ లేదని తెలుసుకున్నాను. అందుకని ఇప్పుడు నాకు మసీదుకే వెళ్ళాల్సిన పనిలేదని తెలిసింది. ఇక్కడ దేవుడు లేడంటే ఫలానా చోట ఉన్నాడంటే ఆయనకోసం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఉన్నాడని తెలిస్తే అక్కడికి వెళ్ళాల్సిన పనేముంది?” అన్నాడు.
అతని మాటలు జనాలకు అర్థంకాలేదు. హసన్‌కు పిచ్చెక్కిందని అనుకున్నారు. సాధారణ ప్రజానీకానికి హసన్‌లో వచ్చిన విప్లవాత్మకమయిన పరిణామం అర్థం కాదు.
-సౌభాగ్య
https://www.teluguglobal.com//2015/05/12/దేవుడెక్కడున్నాడు-devotional/