దోమలు కుట్టకుండా ఇలా చేయండి!

https://www.teluguglobal.com/h-upload/2024/07/30/500x300_1348433-mosquitoes.webp
2024-07-31 03:45:48.0

దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులే కాకుండా పలు రకాల ఎలర్జీలు, వైరల్ ఫీవర్స్ కూడా సోకుతుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో దోమలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తే మంచిది.

వానాకాలం వచ్చిందంటే దోమల బెడద మొదలవుతుంది. వర్షాకాలంలో ఎక్కడికక్కడ నిల్వ ఉండే నీళ్ల వల్ల దోమలు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. మరి ఈ దోమల బెడద నుంచి తప్పించుకునేదెలా?

దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులే కాకుండా పలు రకాల ఎలర్జీలు, వైరల్ ఫీవర్స్ కూడా సోకుతుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో దోమలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తే మంచిది. దోమలు కుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

దోమలు పోగొట్టేందుకు చాలామంది ఇళ్లల్లో మస్కిటో కాయిల్స్, లిక్విడ్ వేపరైజర్స్ వంటివి వాడుతుంటారు. కానీ, వాటిని పీల్చడం వల్ల దోమల సంగతి అటుంచితే మన ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ వీటి జోలికి పోకపోవడమే మంచిది. మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే రసాయనాల వల్ల ఎలర్జీలు, నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు స్టడీల్లో తేలింది.

సహజంగా దోమలను పోగొట్టేందుకు కర్పూరం బాగా పనికొస్తుంది. సాయత్రం వేళల్లో ఇంట్లో కర్పూరం వెలిగించినా లేదా ఇంటి మూలల్లో కర్పూరం పొడి చల్లినా ఆ వాసనకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

లెమన్ గ్రాస్, పుదీనా, లెమన్ బామ్, సిట్రొనెల్లా వంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా దోమలు రాకుండా చూసుకోవచ్చు. ఆయా మొక్కల నుంచి వచ్చే వాసనకు దోమలు దూరంగా పోతాయి.

నిమ్మ, లవంగం వంటి వాసనలు కూడా దోమలను ప్రాలదోలతాయి. నిమ్మకాయను సగానికి కోసి అందులో లవంగాలను గుచ్చి గది మూలల్లో ఉంచొచ్చు. లేదా ఎండబెట్టిన నిమ్మ తొక్కలు లేదా నారింజ తొక్కలను కాల్చి పొగ వేసినా ఇంట్లోకి దోమలు రావు.

ఇకపోతే దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరాన్ని పూర్తిగా కవర్ చేసేలా బట్టలు వేసుకోవాలి. అలాగే యూకలిప్టస్ ఆయిల్, నీమ్ ఆయిల్, లవంగం నూనె వంటివి ఒంటికి రాసుకుంటే దోమలు ఒంటిపై వాలకుండా ఉంటాయి. వీటితో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.

Mosquito,Mosquito Bite,Dengue,Malaria
What smell do mosquitoes hate, Mosquito, Mosquito Bite, dengue, Malaria, Telugu News, Telugu Global News, Latest News, News, Today news

https://www.teluguglobal.com//health-life-style/do-this-without-getting-bitten-by-mosquitoes-1053781