ధన్యుణ్ణి మిత్రమా..!

2023-04-10 11:00:52.0

https://www.teluguglobal.com/h-upload/2023/04/10/730308-friend.webp

నువ్వు..

నా ప్రాణ మిత్రుడివి..

అందుకే అరక్షణమైనా మరుపు

లేకుండా అనుక్షణం గుర్తొస్తావు..!

నా ఊపిరిలో..

నా శ్వాసలో..

ప్రతీ క్షణం నువ్వుంటావు..!

నా మనసుకు అద్దంలా..

నా వాక్కుకి అర్థంలా..

పల్లవీ చరణాల్లా మనం

ఎప్పుడూ కలిసే ఉంటాం ..!

నా ఊహల్లో.. ఊసుల్లో..

నా ప్రతి కదలికలో నువ్వుంటావు

నన్ను నడుపుతూ.. నడిపిస్తూ..!

మంచేదో.. చెడేదో చెప్పే

విలక్షణమైన వ్యక్తిత్వం నీది

నా తప్పుల్ని విప్పి చెప్పే

అధికారం నీకు మాత్రమే ఉంది..!

స్నేహం దేవుడిచ్చిన వరం..

నిలబెట్టుకోవడం మాత్రమే

నేను చేయగలిగే ప్రయత్నం..!

నువ్వు నా స్నేహితుడివి

అని చెప్పగానే జనం నన్ను

ఇట్టే అంచనా వేసేస్తున్నారు

మిత్రమా..!

ఆ గొప్పదనం అంతా నీదే..!

నా ఆలోచనల్లో..

నా అంతరంగంలో ..

నీ ముఖచిత్రం ముద్రించబడి

ఉంటుంది..!

నీ స్నేహ సామ్రాజ్యంలో

నేనొక మహా రాజును..!

నేను గొప్పో కాదో

తెలియదు కానీ

నీకు మిత్రుణ్ణి అయి

నేను ధన్యుణ్ణి

అనిపించుకున్నాను

– జి.రంగబాబు

Telugu Kavithalu,G Ranga Babu