నన్ను గిల్లాడు, నా బలపం కొట్టేశాడు, నా పెన్సిల్ విరగ్గొట్టాడు

2024-07-28 05:19:46.0

అసలు జగన్ కు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారని, ఆయన మాటలు ఆయనకైనా కామెడీగా అనిపించడంలేదా అని అన్నారు నాగబాబు.

https://www.teluguglobal.com/h-upload/2024/07/28/1347779-nagababu.webp

ఎన్నికల వేళ జగన్ పై విమర్శలు చేసే విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పోటీ పడ్డారు. కానీ ఎన్నికల తర్వాత మాత్రం వారిద్దరూ కాస్త వెనక్కి తగ్గారు. నేరుగా జగన్ పై విమర్శలు చేయడంలో నిదానించారు. అయితే వారి బదులు అటు లోకేష్, ఇటు నాగబాబు ఈ విషయంలో కాస్త స్పీడందుకున్నారు. జగన్ కామెంట్లకు నేరుగా లోకేష్ బదులిస్తున్నారు, ఇటు జనసేన నుంచి నాగబాబు జగన్ పై సెటైర్లు పేలుస్తున్నారు. తాజాగా జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఓ విషయాన్ని నాగబాబు హైలైట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు, పెద్దిరెడ్డి క్లాస్ మేట్స్ అని, ఓసందర్భంలో పెద్దిరెడ్డి, చంద్రబాబుని కొట్టారని, అప్పటినుంచి ఆయనపై ఈయనకు పీకలదాకా కోపం ఉందని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు జగన్. అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగారని అన్నారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నాగబాబు కాస్త వెరైటీగా స్పందించారు. జగన్ కామెంట్స్ కి కాస్త కామన్ సెన్స్ యాడ్ చేస్తే బాగుండేదని అన్నారాయన.

చిన్నప్పుడు నా బలపం కొట్టేశాడు, నా పెన్సిల్ విరగ్గొట్టాడు, నన్ను గిల్లాడు అని పెద్దయ్యాక ఎవరైనా పగ తీర్చుకుంటారా..? అని జగన్ ని ప్రశ్నించారు నాగబాబు. ఇవన్నీ అవగాహన లేని వ్యాఖ్యలని ఎద్దేవా చేశారు. అసలు జగన్ కు ఎవరు ఇలాంటి సలహాలిస్తున్నారని, ఆయన మాటలు ఆయనకైనా కామెడీగా అనిపించడంలేదా అని ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు ఇలాంటి నాయకుడు మనకు సీఎంగా ఉన్నారా అని జనం షాక్ లో ఉన్నారని చెప్పారు నాగబాబు.