నమ్మేళనం

2023-11-03 18:51:47.0

https://www.teluguglobal.com/h-upload/2023/11/03/850872-samelana.webp

సంపాదించుకున్నాను

కొందరు ప్రియమైన శతృవులను

సహకరిస్తున్నారు అనునిత్యం

అప్రమత్తంగా ఉండేలా

కూడగట్టుకున్నాను.

కొందరు ఆప్రియమైన మిత్రుల్నీ

హెచ్చరిస్తున్నారు కరుకుగానే

కట్టూ హద్దూ నే తప్పిన వేళ

వెంటనే ఉంచుకున్నాను.

కొందరు వంది మాగధులనూ

పంచేస్తున్నారు ఉచితంగానే

ఆట విడుపునూ వినోదాన్ని

చేరదీసాను చెంతకు

కొందరు ఈర్ష్యాళువులనూ

పుటం పెట్టేస్తున్నారు క్షణక్షణం

ఆత్మ స్థైర్యాన్ని మనో నిబ్బరాన్నీ

ఉంచుకున్నాను సమీపంలోనే

కొందరు కపటులనూ పంచకులనూ

రాటుదేల్చేస్తున్నారు తట్టుకునేలా

దొంగ దెబ్బలనూ వెన్ను పోట్లనూ

పొదువుకున్నాను

హృదయపు లోతుల్లోనే

పసి పిల్లలనూ పూలనూ

ప్రేరణనిస్తున్నారు నిష్కల్మషంగా జీవించడానికి

మాలిన్యం నిర్మలత్వం

దు:ఖమూ సంతోషమూ

అహమూ మోహమూ వైరాగ్యమూ

భిన్న వర్ణాలూ

విభిన్న భావోద్వేగాలు

వైవిధ్యమైన అనుభవాలు

అన్నింటి సమ్మేళనమే కదా మరి

జీవితం.

– రత్నాజయ్ ( పెద్దాపురం)

Ratnaja,Telugu Kavithalu