https://www.teluguglobal.com/h-upload/2024/11/27/1381322-dhanush.webp
2024-11-27 08:31:38.0
డాక్యుమెంటరీ వివాదంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్ర నిర్మాణ సంస్థ
నటి నయనతార, ఆమె భర్త డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌పై ధనుష్ దావా వేశారు. పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్ ను ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ లో వాడుకోవడంతో ఆయన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పై దావా వేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. దీనిపై విచారణకు అంగీకరించింది.
డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొన్న విషయం విదితమే. తమకెంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని కోరినా.. చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని దానికి తాను ఎంతో బాధపడ్డానని పేర్కొంటూ నయనతార ఇటీవల ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మూడు సెకన్ల సీన్స్ వినియోగించినందుకు పరిహారంగా ఆయన రూ. 10 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్‌ను తప్పుపట్టారు. తనపై ఆయన ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్‌లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆమెకు పలువురు నటీమణులు మద్దతు తెలుపగా.. ధనుష్‌కు అభిమానుల సపోర్ట్ లభించింది.
నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నది. నయనతార కెరీర్, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలు ఇందులో చూపించారు. ముఖ్యంగా విఘ్నేష్ శివన్‌తో ఆమె పరిచయం, ప్రేమ, పెళ్లితో ఇది సిద్ధమైంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’లో నయనతార హీరోయిన్‌గా నటించగా.. ధనుష్ నిర్మాత. ఈ సినిమా సెట్‌లోనే నయన్-విఘ్నేశ్ ఫ్రెండ్‌షిప్ మొదలైంది. అందుకే ఈ సినిమా వీడియోలు, పాటలను డాక్యుమెంటరీలో చూపించాలని ఈ దంపతులు భావించారు. దీనికి ధనుష్ అంగీకరించకపోవడంతో వివాదం మొదలైంది.
Dhanush files case,Against Nayanthara,Vignesh Shivan,Over Netflix documentary