https://www.teluguglobal.com/h-upload/2023/06/21/500x300_786151-bones-telugu-news.webp
2023-06-21 11:07:29.0
ఇది ఆశ్చర్యకరమైన విషయమే. నలుగురితో కలిసిమెలసి కాకుండా ఒంటరిగా ఉండేవారిలో ఎముకలు బలహీనమైపోతాయని ఓ అధ్యయనంలో తేలింది.
ఇది ఆశ్చర్యకరమైన విషయమే. నలుగురితో కలిసిమెలసి కాకుండా ఒంటరిగా ఉండేవారిలో ఎముకలు బలహీనమైపోతాయని ఓ అధ్యయనంలో తేలింది. అదీ మగవారిలోనే అలా జరుగుతుందట. చికాగోలో నిర్వహించిన ఎండోక్రైన్ సొసైటీ సాంవత్సరిక సమావేశంలో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
సమాజంలో నలుగురితో కలిసిమెలసి జీవించలేకపోవటం మానసిక ఒత్తిడికి గురిచేస్తుందని పెద్దవయసువారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని, ఒంటరితనం కారణంగా ఏర్పడే మానసిక ఒత్తిడి ఎముకలను బలహీన పరుస్తుందని ఓ నూతన అధ్యయనంలో వెల్లడైంది. సామాజిక ఒంటరితనం వలన పలురకాల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం, మరణాల రేటు కూడా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
మానసిక ఒత్తిడి… దానికారణంగా వచ్చే మెంటల్ హెల్త్ డిజార్డర్లు ఎముకల వ్యాధులకు దారితీస్తాయని ఇంతకుముందుకూడా అనేక పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు సామాజిక ఒంటరితనం వలన కలిగే ఒత్తిడి ప్రత్యేకంగా మగవారి ఎముకలను గుల్ల చేస్తుందని నూతన అధ్యయనం అంటోంది. దీనిపైన మరింత లోతైన పరిశోధన జరగాల్సి ఉంది.
పరిశోధకులు ఎలుకల పైన ఈ అద్యయనం నిర్వహించారు. కొన్ని ఎలుకలను ఒక్కోబోనులో ఒక్కోదాన్ని ఉంచారు. కొన్ని ఎలుకలను ఒక బోనులో నాలుగు చొప్పున ఉంచారు. ఇలా నాలుగువారాల పాటు ఉంచాక వాటి పరిస్థితిని పరిశీలించారు. ఒంటరిగా బోనుల్లో ఉన్న ఎలుకల్లో ఎముకల ఆరోగ్యం క్షీణించడం గుర్తించారు. అయితే అత్యంత నాటకీయంగా మగ ఎలుకల్లో మాత్రమే ఇలా జరగటం పరిశోధకులు గమనించారు.
ఒంటరితనంతో ఎముకల బలహీనతే కాదు…
♦ గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
♦ రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
♦ బరువు పెరుగుతారు, నిద్రలేమికి గురవుతారు.
♦ అధిక రక్తపోటు, ఆందోళన, డిప్రెషన్, మెదడు శక్తి క్షీణత, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
♦ మెదడుకి సంబంధించిన రుగ్మత డిమెన్షియా వచ్చే ప్రమాదం యాభైశాతం పెరుగుతుంది.
Health Tips,bones,Human bones
Health, Health Tips, bones, Oyster, telugu news, telugu global news, latest telugu news, health, health news, health tips news, ఎముకలు, మగవారిలో ఎముకలు
https://www.teluguglobal.com//health-life-style/if-you-cant-meet-with-four-people-bones-are-oysters-in-men-942121