నాంపల్లిలో డబుల్‌ ఓట్లున్నయ్‌.. అయితే ఈసీకి కంప్లైంట్‌ చేయండి

2025-02-04 12:10:51.0

సీఎం రేవంత్‌ రెడ్డికి అక్బరుద్దీన్‌ సవాల్‌

సామాజిక, రాజకీయ, ఆర్థిక, కుల సర్వేపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తప్పిదాలను ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ఎండగట్టారు. ఓటరు జాబితాకు, 2011 జనాభా లెక్కలకు ఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వే వివరాలకు అసలే పొంతనే లేదని.. మళ్లీ సర్వే చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సీఎం రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం సమగ్రంగా సర్వే నిర్వహించిందని, ఓటరు లిస్టుతో పోలిక అంటే ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే డబుల్‌ ఓట్లు వేలల్లో ఉన్నాయని అన్నారు. అక్బరుద్దీన్‌ స్పందిస్తూ.. నాంపల్లిలో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రభుత్వం ఈసీకి కంప్లైంట్‌ చేసుకోవాలని సవాల్‌ విసిరారు. తాను ఒక్క ముస్లింలకే ప్రతినిధిని కాదని అన్నివర్గాల ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని అన్నారు. 2023 ఆధార్‌ లెక్కల ప్రకారమే తెలంగాణలో 3.80 కోట్ల మంది ఉన్నారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో సర్వే చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని.. అలాంటప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేను అసెంబ్లీలో టేబుల్‌ చేయాలని కోరారు.

Caste Census,Telangana Assembly,Revanth vs Akbar,Doble Votes in Nampally,Many Mistakes in Survey