https://www.teluguglobal.com/h-upload/2023/10/10/500x300_838214-nervous-system.webp
2023-10-10 07:22:59.0
మనశరీరంలో మెదడు, వెన్ను పాము, శరీరమంతటా వ్యాపించే నరాలన్నింటినీ కలిపి నెర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ అంటారు.
మనశరీరంలో మెదడు, వెన్ను పాము, శరీరమంతటా వ్యాపించే నరాలన్నింటినీ కలిపి నెర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ అంటారు. నాడీ వ్యవస్థ న్యూరాన్లు అనే కణాలను ఉపయోగించుకుని మెదడునుండి సందేశాలను వెన్నుపాము ద్వారా శరీరానికి, తిరిగి శరీరం నుండి మెదడుకి చేరవేస్తుంటుంది. అయితే ఈ నరాల వ్యవస్థ తగిన రీతిలో కాకుండా అతిగా స్పందించినప్పుడు, అంటే మితిమీరిన చురుకుదనం ప్రదర్శించినప్పుడు మన శరీరంలో దాని తాలూకూ మార్పులు, సమస్యలు కనబడుతుంటాయి. మరి నరాల వ్యవస్థ ఓవర్ యాక్టివ్ గా ఉంటే కనిపించే లక్షణాలేంటి… దాని పనితీరుని సరిచేయాలంటే ఏం చేయాలి… ఈ అంశాలను గురించి తెలుసుకుందాం..
నాడీ వ్యవస్థ పనితీరులో తేడా ఉంటే కనిపించే శారీరక లక్షణాలు
-బరువు పెరుగుతుంటారు.
-శారీరక నొప్పులు, ఛాతీలో నొప్పులుంటాయి.
-గుండె వేగం పెరుగుతుంది.
-విరేచినాలు లేదా మలబద్ధకం ఉండవచ్చు.
-వికారం, వాంతులు, మగత, లైంగిక సామర్ధ్యంలో లోపం ఉంటాయి.
-రోగనిరోధశక్తి తగ్గుతుంది
ప్రవర్తనా పరమైన లక్షణాలు
-ఆహారం తక్కువగా లేదా ఎక్కువగా తీసుకుంటారు.
-మరీ ఎక్కువగా లేదా తక్కువగా నిద్రపోతుంటారు.
-బాధ్యతలను పట్టించుకోరు.
-వీరు రిలాక్స్ అవటం కోసం ఆల్కహాల్, డ్రగ్స్, సిగరెట్లు లాంటివాటిపై ఆధారపడుతుంటారు.
-గోళ్లు కొరకటం లాంటి అలవాట్లుంటాయి.
-నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు.
మెదడు సామర్ధ్యానికి సంబంధించిన లక్షణాలు
-ఏకాగ్రత లోపం, మతిమరుపు ఉంటాయి.
-నిర్ణయాలు తీసుకోలేరు…మంచి చెడు ఆలోచించే విచక్షణ తగ్గుతుంది.
-నెగెటివ్ ఆలోచనలు, ఆందోళన, ఆలోచనల వేగం పెరుగుతాయి.
భావోద్వేగాల్లో తేడాలు
-అసహనంగా, కోపంగా, మూడీగా ఉంటారు.
-ఆందోళన ఎక్కువగా ఉంటుంది. రిలాక్స్ కాలేరు.
-ఫీలింగ్స్ ని నియంత్రించుకోలేరు. దాంతో కోపం దు:ఖం లాంటి భావోద్వేగాలు పెరుగుతుంటాయి.
-తాము ఒంటరివారిమనే భావంతో ఉంటారు.
-డిప్రెషన్ ఉంటుంది. అలాగే సంతోషంగా ఉండగల సామర్ధ్యం తక్కువగా ఉంటుంది.
నాడీ వ్యవస్థ పనితీరులో తేడాలెందుకు?
మనం ఏదైనా ఆపదలో ఉన్నపుడు మనలోని సింపథటిక్ నరాల వ్యవస్థ స్పందించి… మన శరీర పనితీరు… ఫ్లైట్ ఆర్ ఫైట్ అనే విధానంలోకి వెళుతుంది. అంటే పారిపోవటం లేదా ఎదురుతిరగటం. ఇందుకోసం అవసరమైన మార్పులు మన శరీరంలో జరుగుతాయి. అడ్రినలిన్ గ్రంథులు స్పందించి ఒత్తిడి హార్మోన్లు విడుదలై రక్తంలో కలుస్తాయి. దాంతో గుండె కొట్టుకునే వేగం, శ్వాస వేగం, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, శరీరంలో శక్తి వినియోగం పెరుగుతాయి. మనిషి గుహల్లో అడవుల్లో నివసించే కాలంలో జంతువులనుండి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకునేందుకు ఏర్పడిన శారీరక లక్షణం ఇది. అయితే ఇప్పుడు అలాంటి ప్రమాదాలు లేకపోయినా… కొంతమంది నిరంతరం టెన్షన్ తో తీవ్రమైన ఒత్తిడి ఆందోళనలతో ఉంటున్నారు. ఈ పరిస్థితులనే ప్రమాదం అనుకుని మన నరాల వ్యవస్థ ఓవర్ గా స్పందిస్తుంటుంది. అంటే ఒత్తిడి వలన శరీరంలో ఫ్లైట్ ఆర్ ఫైట్ లక్షణాలు ఏర్పడతాయి. జీవితంలో గతంలో ఎదుర్కొన్న బాధలు ఒత్తిళ్లను మర్చిపోలేకపోవటం వలన లేదా జీవనశైలి, ప్రవర్తనా పరమైన లోపాల వలన, శరీరంలోని రసాయనాల సమతుల్యతలో తేడాల వలన ఇలా జరుగుతుంటుంది.
నాడీ వ్యవస్థ అతిస్పందనని ఎలా తగ్గించుకోవాలి?
-ధ్యానం, బ్రీతింగ్ వ్యాయామాలతో ఒత్తిడి, దాని కారణంగా వచ్చే సమస్యలనుండి ఉపశమనం కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
-చన్నీటి స్నానం… ముఖ్యంగా సాయంత్రాలు ఇలా చేయటం వలన రోగనిరోధక శక్తిలోనూ వేగస్ అనే నరంలోనూ చైతన్యం పెరుగుతుంది. దీనివలన ఒత్తిడి, దాని కారణంగా తలెత్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి. మెదడునుండి పెద్ద పేగు వరకు ప్రయాణించే పొడవైన నరాలను వేగస్ నరాలంటారు. ఇవి శరీరంలో కుడి ఎడమ భాగాల్లో రెండువైపులా ఉంటాయి.
-నిద్రవేళలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలా లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. మెదడు సామర్ధ్యం ఆలోచనా శక్తి తగ్గుతాయి.
-పళ్లు కూరగాయల వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
-వాకింగ్, ఇంకా తేలికపాటి వ్యాయామాలను చేయాలి. వీరు ఎక్కువ శారీరక శ్రమతో కూడిన వ్యాయామాలు చేస్తే నరాల వ్యవస్థ మరింత ఓవరాక్టివ్ గా మారే అవకాశం ఉంటుంది కనుక తగిన విధంగా వ్యాయామాలు చేయాలి.
-ఆక్యుపంక్చర్, మసాజ్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆక్యుపంక్చర్ తో శరీరంలో తగిన రసాయనాలు విడుదలై సహజంగా ఉపశమనం కలిగేందుకు దోహదం చేస్తాయి. మసాజ్ వలన ఒత్తిడి హార్మోన్ల విడుదల తగ్గిపోయి శరీరం రిలాక్స్ అవుతుంది.
Nervous System,Nervous System Symptoms,Health Tips
nervous system, nervous system tips, nervous system function, nervous system symptoms, nervous system treatment, telugu news, telugu global news
https://www.teluguglobal.com//health-life-style/what-happens-when-the-nervous-system-overreacts-how-to-stop-966778