2025-01-25 15:31:14.0
నాలుగు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవం వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవం పండగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభించాలని చెప్పారు. కొత్త పథకాల ప్రారంభంపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధదారులకు నాలుగు పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. గ్రామానికి మండల ప్రత్యేక అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించాలని, ఒక్కో పథకానికి ఒక అధికారికి బాధ్యత అప్పగించాలని సీఎస్ తెలిపారు.
రేషన్‌కార్డులకు తహసీల్దార్, ఇందిరమ్మ ఇళ్లకు ఎంపీడీవో నేతృత్వంలో బృందాలను నియమించాలని చెప్పారు. రైతు భరోసాకు మండల వ్యవసాయ అధికారి, డిప్యూటీ తహసీల్దార్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఉపాధి హామీ పథకం ఏపీవో బృందం పర్యవేక్షించాలని సీఎస్ తెలిపారు. లబ్ధిదారుల జాబితాను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ సభలకు అర్హులైన లబ్ధిదారులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
CS Shantikumari,Ration cards,Indiramma houses,List of Beneficiaries,Telangana,Indiramma is a spiritual assurance,NREGS