నాలోని నీవు (కవిత )

2023-07-10 19:00:56.0

https://www.teluguglobal.com/h-upload/2023/07/10/793757-nalo-nuvu.webp

నిత్యం నీతో యుద్ధమే

గెలిపిస్తూ ఓడిస్తున్నావో

ఓడిస్తూ గెలిపిస్తున్నానో

అర్థం కావడం లేదు.

నిత్యం నాతో ఆటలే

బలపరుస్తూ బలహీనం చేస్తున్నావో

బలహీనతల నుండి బలం చేకూరుస్తున్నావో

అంతు చిక్కడం లేదు.

నిత్యం నీ నా తలపులే

భావతరంగాల్ని ప్రేరేపిస్తూ

కఠినత్వపు అడ్డుగోడను కడుతున్నావో

అడ్డుగోడలను ద్రవింపజేసే భావనలను పెంచుతున్నావో

తెలియరావడం లేదు.

ఒక్కటి మాత్రం అర్థమైంది.

నను వీడని నీడలా ఉంటూనే

మనసుకు తప్ప

కనుచూపుకు కానరాని

దూరాన ఉన్నావని.

– రాధ ( విజయవాడ)

Telugu Kavithalu