2023-02-20 17:45:27.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/20/723861-naa.webp
అను నిత్యం అన్వేషిస్తాను
ఓటమిలో గెలుపు తొవ్వకై
అంధకారంలో ఆరిపోని
అఖండ దివ్వెకై
ఈ సమాజమనే పాల కడలిని
చిలుకుతుంటాను
హాలాహలం పారబోసి
అమృతం పంచుకోవాలని
అను బంధాల బాటలో
అను రాగాల వేట సాగిస్తాను
కంటకాలు ఏరి పారేసి
కుసమాలు కోసుకోవాలని
అలసటతో ఆగి పోయినా
ఆశల కషాయం తాగేసి
నిరాశకు నిర్మొహమాటంగా
వీడుకోలు చెబుతాను
వృద్ధాప్యపు వడలిన
చర్మంలో జవ సత్వాలు
నింపుతూనే ఉంటాను
నా ఆఖరి మజిలీ వరకు.
-దుద్దుంపూడి. అనసూయ
Naa Anveshana,Duddumpudi Anasuya,Telugu Kavithalu