https://www.teluguglobal.com/h-upload/2023/01/13/500x300_435103-regular-walking-of-6000-9000-steps-reduces-health-risk-by-60-percent-in-elderly-people.webp
2023-01-13 04:01:04.0
15 అధ్యయనాలను విశ్లేషించి గత ఏడాది మార్చిలో ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక కూడా రోజుకు ఎక్కువ శ్రమ చేయడం ద్వారా మాత్రమే మరణాల ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
నడక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తాజాగా జరిగిన ఓ కొత్త అధ్యయనం స్పష్టం చేస్తోంది. సాధారణ శారీరక శ్రమతో ప్రాణాంతక వ్యాధులతో సంబంధం ఉన్న మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని కనుగొంది. ఇది ‘రోజుకు 10,000 అడుగులు నడవడం’ అనే జనాదరణ పొందిన ట్రెండ్ ఔచిత్యాన్ని కూడా చర్చలోకి తెచ్చింది. సర్క్యులేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. వృద్ధులకు నడక ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది. రోజుకు 6 వేల నుంచి 9 వేల అడుగులు నడిచే వృద్ధులకు 2 వేల అడుగులు నడిచే వారి కంటే గుండెపోటు లేదా స్ట్రోక్‌తో బాధపడే అవకాశం 40 నుంచి 50 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది.
నిత్యం నడకలో పాల్గొనే 20,152 వేల మందిని 6 సంవత్సరాలకు పైగా అధ్యయనం చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది. రోజూ వారు నడుస్తున్న దూరం.. వారిలో కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD), నాన్ ఫాటల్ కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అంశాలను బేరీజు వేసుకుని దీనిని అంచనా వేసింది. 60 ఏళ్లు పైబడినవారికి వారి నడక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తోందని అధ్యయనం గుర్తించింది.
శారీరక శ్రమతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను అంచనా వేయడానికి నడకపై తరచుగా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. నడక తక్కువ ప్రభావం చూపే వ్యాయామం కావడంతో పరిశోధకులు దీనిపై నిరంతరం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై కొన్ని అంశాలు ఈ సందర్భంగా గుర్తించారు. శారీరక శ్రమ లేకపోవడం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం. కరోనా మహమ్మారి తర్వాత దీని తీవ్రతను ప్రపంచమంతా అనుభవించింది.
ప్రపంచంలోని కౌమార జనాభాలో 80% కంటే ఎక్కువ మంది శారీరకంగా తగినంత చురుకుగా లేరని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2022 అక్టోబరులో ఒక నివేదికలో వెల్లడించింది. శారీరక శ్రమ లేకపోవడం మానసిక, శారీరక ఆరోగ్యంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని ఈ నివేదిక తెలియజేసింది. ప్రపంచ స్థాయిలో నిర్ధారించిన కనీస శారీరక శ్రమ స్థాయిలను నలుగురు పెద్దల్లో ఒకరు మాత్రమే అందుకుంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది.
15 అధ్యయనాలను విశ్లేషించి గత ఏడాది మార్చిలో ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక కూడా రోజుకు ఎక్కువ శ్రమ చేయడం ద్వారా మాత్రమే మరణాల ప్రమాదం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. 60 ఏళ్ల పైబడినవారు రోజుకు 6 వేల నుంచి 8 వేల అడుగులు, ఇతరులు రోజుకు 8 వేల నుంచి 10 వేల అడుగులు నడవడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చని వివరించింది.
నడక వల్ల కలిగే అదనపు ప్రయోజనాలను సెప్టెంబరులో జామా (JAMA) నెట్‌వర్క్‌లో ప్రచురించిన మరో అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్, హృద్రోగ మరణాలను తగ్గించడంలోనూ రోజువారీ నడక ప్రయోజనకారిగా ఉందని గుర్తించింది. ఈ అధ్యయనంలో 61 సంవత్సరాలు వయస్సు కలిగిన 78,500 మందిని పరిశీలించగా, రోజుకు 10 వేల అడుగుల నడక క్యాన్సర్, హృద్రోగ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వెల్లడైంది.
వృద్ధుల్లో ఎక్కువమంది అనేక కారణాల వల్ల వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. ఈ కారణాల్లో ప్రధానమైనది తక్కువ శారీరక శ్రమ కావడం గుర్తించవలసిన అంశం. నిత్యం శారీరక శ్రమ పెంచడం ద్వారా అన్ని రకాల మరణాలు, హైపర్ టెన్షన్, మూత్రాశయం, రొమ్ము, పెద్ద పేగులో ఏర్పడే నిర్దిష్ట క్యాన్సర్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని ఈ అధ్యయనం గుర్తించింది. ఇలా అత్యధిక శారీరక శ్రమ చేయడం వల్ల వృద్ధుల్లో మానసిక ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు సుఖ నిద్ర లభిస్తుందని పేర్కొంది.
Regular walking,6000 to 9000 Steps,Reduces,Health Risk,60 percent,Elderly People
Regular walking, 6000 to 9000 Steps, Reduces, Health Risk, 60 percent, Elderly People
https://www.teluguglobal.com//health-life-style/regular-walking-of-6000-9000-steps-reduces-health-risk-by-60-percent-in-elderly-people-555132