https://www.teluguglobal.com/h-upload/2024/11/25/1380795-wankidi-student.webp
2024-11-25 12:25:29.0
25 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన శైలజ
వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శైలజ తుది శ్వాస విడిచింది. 25 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న శైలజ సోమవారం తుది శ్వాస విడిచింది. 25 రోజుల క్రితం వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉన్న శైలజ సహా పలువురు విద్యార్థులను నిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. శైలజ మినహా మిగతా విద్యార్థులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. శైలజ కోలుకోకపోవడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ కొనసాగించారు. ఆమె ఆరోగ్యం ఎంత మాత్రం మెరుగుపడలేదు. పరిస్థితి మరింత క్షీణించడంతో కన్నుమూసింది.
శైలజ మృతికి రేవంత్ ప్రభుత్వమే కారణం : మాజీ మంత్రి హరీశ్ రావు
వాంకిడి గురుకుల విద్యార్థి శైలజ మృతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆమె ప్రాణాలు బలితీసుకున్న పాపం ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతుందని ‘ఎక్స్’లో హెచ్చరించారు. 25 రోజులుగా ఆమె వెంటిలేటర్ పై అనుభవించిన నరకానికి ఈ ప్రభుత్వమే జవాబుదారి అన్నారు. ఆమె తల్లిదండ్రులకు రేవంత్ రెడ్డి గుండెకోత మిగిల్చాడని అన్నారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విషాహారం వల్ల కన్నుమూయటం కలిచి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారిందని, ఆమె తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిందన్నారు. గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టకపోగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించలేదన్నారు. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశ్యంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. శైలజ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించి ఆమె కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Wankidi,Gurukulam,Food poison,Student Sailaja,Died in NIMS,Revanth Reddy,Harish Rao