2025-02-26 13:19:34.0
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం తీరు : కేటీఆర్
https://www.teluguglobal.com/h-upload/2025/02/26/1407018-ktr.webp
జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళకు శాపంగా పరిణమిస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణపై తమిళనాడు సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో చేస్తోన్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం జనాభా నియంత్రణను ఒక యజ్ఞంలా భావించి.. దాన్ని విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శిక్షించాలని చూస్తోందా అని ప్రశ్నించారు. “జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేసిన కృషిని పట్టించుకోకుండా, కేవలం జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం” అని మండిపడ్డారు.
దక్షిణాది రాష్ట్రాలు దేశ నిర్మాణంలో అందించిన సహకారాన్ని ఎవరూ కాదనలేరని గుర్తు చేశారు. “1951లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 26.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 19.8 శాతానికి పడిపోయిందన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి ఉత్తర రాష్ట్రాల జనాభా వాటా 39.1 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను నిర్ణయిస్తే, ఉత్తరప్రదేశ్. బిహార్‌లకు కలిపి 222 సీట్లు వస్తాయని, ఐదు దక్షిణాది రాష్ట్రాలకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ) కలిపి కేవలం 165 సీట్లు మాత్రమే లభిస్తాయన్నారు. “దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అన్ని రంగాల్లో ఉత్తరాది రాష్ట్రాల కంటే గణనీయంగా మెరుగైన పనితీరు కనబరిచాయన్నారు. అలాంటి రాష్ట్రాలను శిక్షించి, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 2.8 శాతమే ఉన్న తెలంగాణ దేశ జీడీపీకి 5.2 శాతం సహకారం అందిస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన సహకారం అందిస్తున్నాయనే అంశాన్ని నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణలో పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Lok Sabha,Constituencies Delimitation,Based on Population,Union Govt,Narendra Modi,South India,KTR,BRS,Stalin,Tamil Nadu