2022-12-23 16:22:17.0
https://www.teluguglobal.com/h-upload/2022/12/23/432497-nirvedam.webp
జీవనసమరంలో….
స్వేదం తో తడిపి
తన శరీరాన్నే పంటభూమి చేసి…
పండించిన పంటను
పంచి పెట్టి..అలసిన
హాలికుడివా?
దేశసరిహద్దుల్లో..
మంచు కొండల్లో.
డేగ వంటి
చురుకైన కంటి చూపుతో వెదకి ..వెదకి
శత్రుమూకల చొరబాటుని అడ్డుకుని..
మాతృదేశ సేవకు అంకితమై..
పోరాడి. పోరాడి అలసిన యోధుడవా?
నీ బిగిసిన పిడికిలి లో
సుత్తి పట్టి..
గనులను. తొవ్వి..తొలిచి ..తొలిచి
అలిసి సొలసిన…
కార్మికుడివా?
నీ వు ఎవరైనా ..
ఒక తల్లి కి గారాల బిడ్డవి ..
వేరొక..స్త్రీకి
జీవితం పంచిన
సహచరుడివి..
మరొక..బిడ్డ జన్మ కు కారకుడైన తండ్రివి..
ఎందరున్నా ….
కాలం కరిగి పోయింది!
జీవితం.. జరిగి పోయింది!
కరిగి పోయిన కాలం…మిగిల్చింది? ఒంటరితనం….
రేపేంటి..
అనే..ప్రశ్న..మాత్రమే!
ఈ వృద్ధాప్యంలో..మరో సమరం..మొదలయ్యింది!
తండ్రీ!
వదిలేయ్ ఈ నిర్వేదం..
జీవన సంధ్యలో ..లేచి.
నీ బాహువులలో.మళ్లీ ..
జవాలు నింపు..
నీ బోటి వారిని..వెతుకు..
వారితో..కలిసి..చేతిలో చేయి వేసి.
ముందుకు కదులు..
ఓ హాలికుడా! ఓ యోధుడా!
ఓ కార్మికుడా!
అన్ని శక్తులను ఒకే శక్తిగా కలుపుతూ!..
ఓ నూతన .తేజం తో
అడుగులు..ముందుకు వేయండి!
మీ లో ఉంది తరగని
అనుభవ సార సంపద! మీఅనుభవాన్ని ..
లోకానికి పంచండి!
నిర్వేదం…ఎందుకూ!
– పి.బాలా త్రిపుర సుందరి
P Bala Tripura Sundari,Telugu Kavithalu