2023-10-25 11:17:22.0
https://www.teluguglobal.com/h-upload/2023/10/25/846133-rama-devi.webp
ఆత్మీయత వంపుకున్న
కనుపాపల్లో ఒదిగిపోయేందుకు
రెక్కలు మొలిచే
ఈ సెలవురోజుల సంబరం
రైలుయాత్రలా పరుగులుపెట్టేటి జీవితాలకు
బంధాలమజిలీల్లో
అనురాగపు సుగంధాలు అద్దుకునే ఆత్రుతల సంరంభం
గడియ రికాము లేని
యాంత్రిక జీవితాలకు
కాస్తంత సాంత్వన దొరికే
పండుగ రోజులదొంతర
పుట్టిల్లుచేరి
గతస్నేహపు నెమలీకలపై
బాల్యానికి రివ్వున ఎగిరిపోయే శుభగడియల పొది
వంటింటి సరదాల నుండి
జాతర సందళ్ళ దాకా కలిసిసాగే సంతోష పూగుచ్చాలు
పలకరింపుల తడిదనాలతో పులకరిస్తూ
రేపటి రోజుకు కొత్త శక్తిని పొందే అనుభవాలివి
దసరా పంచిన సంబరాల పిట్టగూళ్ళలో
మళ్ళీ మళ్ళీ కలిసి ఉండాలనే ఆనంద వాక్యాలతో
ఏడాది కాలం ఆత్మ పుస్తకానికి మెరుగులద్దుకునే
మధురమైన రోజులివి
పేదింట అయినా పెద్దింటనైనా
అన్నంతో పాటు
అనురాగాలను కడుపునింపుకునే విజయదశమి గెలుపు గానాలివి
జీవితపుటలలోని నిశీధుల్లో
ఉత్సాహ భానుని ఉషోదయాలివి
రమాదేవి బాలబోయిన
Ramadevi Balaboyina,Telugu Kavithalu,Nisidhiloni Ushodayalu