నీకంటే పిరికి, అహంకారి, మోసకారి ఎవరు..? ష‌ర్మిల‌కు వైసీపీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

2024-07-28 12:11:42.0

అలాంటపుడు మీకన్నా పిరికివాళ్లు, మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? అంటూ షర్మిలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది వైసీపీ.

https://www.teluguglobal.com/h-upload/2024/07/28/1347866-ycp-strong-counter-to-ap-congress-president-ys-sharmilas-tweet.webp

అధికారంలో ఉన్న కూట‌మి పార్టీల‌ను పల్లెత్తు మాట అనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.. పదేపదే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మొన్న ఢిల్లీలో జగన్‌ దీక్షను తప్పుబట్టిన షర్మిల, నిన్న జగన్‌ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ను ఉద్దేశించి పిరికితనం, చేతకానితనం అహంకారం అంటూ ఘాటైన పదాలు వాడారు.

షర్మిల వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం అంతే ఘాటుగా స్పందించింది. చంద్రబాబు ఏజెంటుగా మారి రాజకీయాలు చేసే వారికి, ప్రజల తరఫున ప్రతిక్షణం ఆలోచించి వారికోసం పనిచేసేవారికీ చాలా తేడా ఉంటుంది అంటూ కౌంటరిచ్చింది. “మీ మాటలు చూస్తే జగన్‌ గారి మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప, ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు. దివంగత మహానేత, మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే.. ఎప్పుడైనా నోరు విప్పారా?. హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు చేస్తుంటే టీడీపీని ఒక్క మాటైనా అన్నారా?” అని షర్మిలను వైసీపీ ప్రశ్నించింది.

తెలంగాణలో పుట్టా.. తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి ఏపీకి పారిపోయి వచ్చింది మీరు. అలాంటపుడు మీకన్నా పిరికివాళ్లు, మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? అంటూ షర్మిలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది వైసీపీ. ఆఖర్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కూడా పంచ్ వేసింది. ఇంతకీ మీరు పోస్టు చేసిన ట్వీట్‌ చంద్రబాబు దగ్గరనుంచి వచ్చిందా? లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా? అంటూ సెటైర్ వేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.