http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/deworming-drive.png
2016-02-10 05:41:47.0
పిల్లల ఆరోగ్య పరిరక్షణకు 536 జిల్లాల్లో ఒక బృహత్తర జాతీయ ఆరోగ్య పథకానికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద వచ్చే సంవత్సరంలో 27కోట్ల మంది పిల్లలకు పొట్టలోని నులి పురుగులను నిర్మూలించే విధంగా చికిత్సలు, ముందుజాగ్రత్త చర్యలు చేపడతారు. గత ఏడాది 277 జిల్లాల్లో 11 రాష్ట్రాలకు మాత్రమే వర్తింప చేయాలనుకున్నా, మన దేశ చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటం వలన ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసింది, దీంతో దీన్ని […]
పిల్లల ఆరోగ్య పరిరక్షణకు 536 జిల్లాల్లో ఒక బృహత్తర జాతీయ ఆరోగ్య పథకానికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద వచ్చే సంవత్సరంలో 27కోట్ల మంది పిల్లలకు పొట్టలోని నులి పురుగులను నిర్మూలించే విధంగా చికిత్సలు, ముందుజాగ్రత్త చర్యలు చేపడతారు.
గత ఏడాది 277 జిల్లాల్లో 11 రాష్ట్రాలకు మాత్రమే వర్తింప చేయాలనుకున్నా, మన దేశ చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండటం వలన ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసింది, దీంతో దీన్ని అమలుచేయడానికి మరింతమంది హెల్త్ వర్కర్లను, నిపుణులను అందుబాటులోకి తేనుంది.
పారాసిటిక్ వార్మ్స్ లేదా సాయిల్‌ట్రాన్స్‌మిటెడ్ హెల్‌మిన్త్…ఈ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉన్న ఇన్‌ఫెక్షన్లు. పొట్టలోని నులిపురుగులు అని సాధారణ భాషలో చెప్పుకునే ఈ క్రిములు రక్తలేమికి, పోషకాహార లోపానికి దారితీస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, ఇవి పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు కూడా అడ్డుపడతాయి. ఇవి ఉంటే పిల్లలు తరచుగా కడుపు నొప్పికి గురవుతుంటారు.
మనదేశంలో ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌కి గురిచేసే క్రిములు చాలా ఎక్కువగా ఉన్నాయి. 1-14 మధ్య వయసున్న పిల్లల్లో 22కోట్లకు పైగా వీటి ఇన్‌ఫెక్షన్‌కి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నూటయాభై కోట్ల మంది చిన్నారులు వీటిబారిన పడుతున్నారు. అంటే మొత్తం ప్రపంచ జనాభాలో 24శాతం అన్నమాట.
మనదేశంలో వీటి కారణంగా పిల్లల్లో మెదడు ఎదుగుదల లోపాలు చాలా ఎక్కువగా తలెత్తుతున్నాయని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. నులిపురుగుల వలన రక్తహీనత, ఐరన్ లోపం ఉంటుంది. ఈ లోపం వలన మెదడు అభివృద్ధి కుంటు పడుతుంది.
ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్యసంస్థ సహకారంతో ఈ సమస్యని అరికట్టాలని భావిస్తోంది. మానవవనరులు, మహిళా శిశు అభివృద్ధి, తాగునీరు తదితర మంత్రిత్వ శాఖలతో కలిసి ఈ విషయంలో ముందుకు సాగుతామని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జెపి నడ్డా అన్నారు. రాష్ట్రప్రభుత్వాలను, ఆరోగ్యశాఖా రంగంలోని వారిని, స్వచ్ఛంద సంస్థలను సైతం ఇందులో భాగం పంచుకునేలా చేయాలనుకుంటున్నారు.
అన్నిరకాల స్కూళ్లలో పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అలాగే పరిశుభ్రతని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలనుకుంటోంది.
Deworming drive
https://www.teluguglobal.com//2016/02/10/deworming-drive-to-cover-27-crore-kids-across-536-districts/