నువ్వక్కడ (కవిత)

2023-06-11 17:36:32.0

https://www.teluguglobal.com/h-upload/2023/06/11/780389-padma.webp

నువ్వక్కడ

శిథిలాల కొమ్మలకు పూసిన

జ్ఞాపకాలపూలను

ఏరుకోవడానికే వెళ్ళుంటావు

వెళ్ళీవెళ్ళంగానే

ఆ నేల కింద దొరికిన

అమ్మ కన్నీటి ముత్యాలను

జేబులో వేసుకుని

నాన్న నులివెచ్చని స్పర్శను

ఊహలలో కౌగిలించుకుని ఉంటావు

బ్రతుకు సముద్రంలోని

కెరటాలదెబ్బకు

బీటలు వారిన

ఒంటరి పడవొకటి

ఎదురుచూపుల తెరచాపై

నీకు చోటిచ్చి ఉండి ఉంటుంది

గోడకు వేళ్ళాడే పాతకాలెండర్

గాలికి ఆడుతూ

గతస్మృతులను గొంతెత్తి పాడిందా

కాలాగ్ని సెగకు

మసకబారిన కలలు

నీ గుండె పొరలను ఒలిచాయా

ఎన్నాళ్ళకో వెళ్ళావు కదా

గాయాలపై ముసిరిన

తలపుల ఈగలను తోలుకుంటూ

ఇంటి మరమ్మతు కోసం

ఆలోచనల కసరత్తు చేసి ఉంటావు

కూలిపోతున్న పైకప్పును

చిటికెనవేలుపై పట్టుకుని

ఆ స్ధానంలో

ఒక ఆకాశాన్ని నిలబెట్టాలనే

నీ ఆశ

ఎన్నో ఏళ్ళ నుండి

అల్లకల్లోలాలతో తలపడుతూ

అల్లుతున్న వసంతస్నప్నంతో

ఏకాకి శిశిరంలో

చిరుదివ్వెను వెలిగించాలనే

నీ ఆకాంక్ష

పరవాలేదు

నీ కోరిక బీజం

ఏదో ఒకనాడు పచ్చగా మొలకెత్తకపోదు

పురాతన పుస్తకంలోని

అక్షరాలను కళ్ళకద్దుకుంటూ

కొత్త పుటలలో

ఆ పరిమళాలను ప్రతిబింబించడమే కదా

జీవితమంటే

– రాంభక్త పద్మావతి

Telugu Kavithalu,Padmavathi Rambhakta