2025-01-13 13:22:49.0
త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు
https://www.teluguglobal.com/h-upload/2025/01/13/1394186-maha-kumbamela.webp
లక్షలాది మంది భక్తుల పారవశ్యం మధ్య త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా నేత్రపర్వంగా సాగుతున్నది. పౌష్ పూర్ణిమ పుణ్యగడియల్లో వేకువజామునే ప్రారంభమైన పుణ్యస్నానాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. మొదటిరోజు కోటిన్నరమంది పుణ్యస్నానాలు చేసినట్టు కుంభమేళా అధికారులు ప్రకటించారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళా అత్యంత వైభవంగా సాగుతున్నది. తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు, యముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా భక్తులు బృందాలు, బృందాలుగా త్రివేణి సంగమ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ తెల్ల వారు జామున పౌష్ పౌర్ణమి గడియలు సమీపించగానే లక్షలాది మంది తొలి పుణ్యస్నానాలు ఆచరించారు. పౌష్ పౌర్ణమి రోజు శ్రీహరిని, శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పాపాలు తొలిగి మోక్షం లభిస్తుందనే నమ్మకంతో లక్షలాదిమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
శంఖాలు ఊదుతూ, భజనలు చేస్తూ .. జై గంగామాతా నినాదాలతో భక్తులు పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. కుంభమేళాకు పెద్ద ఎత్తున సాధువులు, యోగులు, సాత్వికులు తరలివచ్చారు. 13 అకాడాలకు చెందిన సాధువులు కుంభమేళాలో పాల్గొంటున్నారు.దేశ విదేశాలకు చెందిన భక్తులు, సాధ్వీలు, సాధువులు పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. వందలాదిమంది అఘోరాలు గత కొద్దిరోజులుగా ప్రయాగ్ రాజ్లోనే మకాం వేశారు. కుంభమేళాకు దాదాపు 10 వేల ఎకరాల ప్రాంతంలో యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో త్రివేణి సంగమ ప్రాంతం ఆధ్యాత్మిక సౌరభాలు విరజిమ్ముతున్నది.భక్తుల భద్రత దృష్ట్యా యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో పోలీసులు, పారా మిలటరీ దళాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెట్టారు. భూమండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్నది.
Mahakumbh 2025,Paush Purnima,Celebrated,Largest gathering on Earth,Ganga,Yamuna,and the mythical Saraswati,Under stringent security measures,Devotees