నేనున్నానంటూ భరోసా.. నేడు విజయవాడ ఆస్పత్రికి జగన్

2024-08-06 05:46:37.0

వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటాననే భరోసా ఇచ్చేందుకే జగన్ విజయవాడ ఆస్పత్రికి వస్తున్నట్టు చెబుతున్నారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/06/1350042-jagan-11.webp

బెంగళూరు టూర్ లో ఉన్న జగన్ నేడు విజయవాడకు వస్తున్నారు. సన్ రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుని ఆయన పరామర్శిస్తారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. దీనికోసం ఇప్పటికే వైసీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటాననే భరోసా ఇచ్చేందుకే జగన్ విజయవాడ ఆస్పత్రికి వస్తున్నట్టు చెబుతున్నారు.

కార్యకర్తలను వదులుకోను..

ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా నేతలు, కార్యకర్తలకు తగిన సమయం కేటాయిస్తున్నారు జగన్. తాడేపల్లి ఆఫీస్ లో ఉన్నా, పులివెందుల క్యాంప్ కార్యాలయంలో అయినా.. ఆయన నిత్యం ప్రజల్ని కలుస్తున్నారు. అదే సమయంలో టీడీపీ దాడుల్లో గాయపడ్డారని చెబుతున్న బాధితుల్ని కలిసి ఓదారుస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిస్తున్నారు. వినుకొండ దాడిలో ప్రాణాలు కోల్పోయిన రషీద్ కుటుంబాన్ని కూడా నేరుగా కలసి ధైర్యం చెప్పారు జగన్. ఆమధ్య కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ అనే యువకుడిని జగన్ పరామర్శించారు. తాజాగా విజయవాడ ఆస్పత్రిలో ఉన్న వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుని కలిసేందుకు వస్తున్నారాయన.

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా జగన్ ఫోకస్ పెట్టారు. బుధ, గురువారాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్‌ వరుసగా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా నిలబెడుతున్నారు జగన్. టీడీపీ పోటీ చేసే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజా ప్రతినిధులు చేజారకుండా వైసీపీ వ్యూహరచన చేస్తోంది.