నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ డైరెక్టర్‌గా తులసీ గబ్బార్డ్‌

2024-11-14 08:24:58.0

నిఘా యంత్రాంగాన్ని నిర్భయంగా తీర్చిదిద్ది రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ .. తన బలమైన వ్యక్తిత్వంతో ఆమె శాంతిని తీసుకొస్తారని ట్రంప్‌ ఆకాంక్ష

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ తన నూతన పాలనా యంత్రాంగంలో ఇండో-అమెరికన్‌ తులసీ గబ్బార్డ్‌కు చోటు కల్పించారు. ఒకప్పటి డెమోక్రట్‌ యూఎస్‌ కాంగ్రెస్‌ ఎంపికైన తొలి హిందువైన తులసీ గబ్బార్డ్‌ను నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగుసార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన తులసీ 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీకి యత్నించారు. పశ్చిమాసియా, ఆఫ్రికాలోని యుద్ధక్షేత్రాల్లో మూడుసార్లు అమెరికా సైన్యం తరఫున ఆమె పనిచేశారు. ఇటీవలే ఆమె రిపబ్లికన్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ వుమెన్‌ లెప్టినెంట్‌ కన్నల్‌ తులసీ గబ్బార్డ్‌ను నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ డైరెక్టర్‌గా ఎన్నుకున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా దేశం కోసం, అమెరికా స్వాతంత్య్రం కోసం తులసీ పనిచేసినట్లు ట్రంప్‌ తెలిపారు. నిఘా యంత్రాంగాన్ని నిర్భయంగా తీర్చిదిద్ది రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ .. తన బలమైన వ్యక్తిత్వంతో ఆమె శాంతిని తీసుకొస్తారని ట్రంప్‌ ఆకాంక్షించారు. తులసీ మనందరినీ గర్వపడేలా చేస్తుందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో విదేశాంగ మంత్రిగా సెనేటర్‌ మార్కో రుబియో ట్రంప్‌ ఎంపిక చేశారు. అమెరికా కోసం రుబియో బలంగా నిలబడుతారని ట్రంప్‌ చెప్పారు. ప్లోరిడాకు చెందిన మాట్‌ గేట్జ్‌ను అటార్నీ జనరల్‌గా ఎంచుకున్నట్లు ప్రకటించారు.

Donald Trump,Appointed,Tulsi Gabbard,First US Hindu lawmaker,Director of National Intelligence