నైట్రోజన్‌ గ్యాస్‌తో మరణశిక్ష

2024-09-27 04:19:33.0

అలాబామాలో ఇలా నైట్రోజన్‌ గ్యాస్‌తో మరణశిక్ష అమలు చేయడం ఇది రెండోసారి

అమెరికాలో నైట్రోజన్‌ గ్యాస్‌ ప్రయోగం ద్వారా దోషికి మరణశిక్ష అమలు చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. తాజాగా ఈ పద్ధతిలో రెండోసారి శిక్ష అమలు చేశారు. పని చేసే చోట ముగ్గురిని హతమార్చిన కేసులో దోషిగా తేలిన యుగెని మిల్లర్‌ అనే వ్యక్తికి దక్షిణ అలాబామాలో గురువారం ఈ శిక్షను అమలు చేశారు. ఆయన ముఖానికి మాస్క్‌ బిగించిన అధికారులు ఆ తర్వాత నెట్రోజన్‌ గ్యాస్‌ పంపడం మొదలుపెట్టారు. దీంతో రెండు నిమిషాల్లోనే మిల్లర్‌ కింద పడిపోయాడు. మరో ఆరు నిమిషాల తర్వాత అతను ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది నిమిషాల్లో మరణశిక్ష అమలు పూర్తయినట్లు వెల్లడించారు.

అయితే అలాబామాలో ఇలా నైట్రోజన్‌ గ్యాస్‌తో మరణశిక్ష అమలు చేయడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో ఓ హత్య కేసులో నిందితుడు కెన్నెత్‌ స్మిత్‌పై దీన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పద్ధతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. స్మిత్‌ కు శిక్ష అమలు చేసే ముందు ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఆయన తరఫు న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాడారు. కానీ కోర్టులో ఆయన ఊరట దక్కలేదు. అంతేకాదు శిక్షను అమలు చేసే సమయంలో స్మిత్‌ నరకయాతన అనుభవించినట్లు మృతుడి బంధులు ఆరోపించారు. 

Nitrogen Gas Execution,Alabama,Alan Eugene Miller,second American