2023-02-12 11:32:50.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/12/722940-panchakriyalu.webp
జీవితం ప్రశాంతంగా …
ఆనందంగా …హాయిగా సాగిపోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటూ వుంటారు. పవిత్రమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడే అలాంటి జీవితం సాధ్యమవుతుంది.
ఆ పవిత్రత అనేది కేవలం ఆధ్యాత్మిక భావాల వలన మాత్రమే కలుగుతుంది. ఆధ్యాత్మిక పరమైన అలాంటి జీవితాన్ని ఆదర్శవంతంగా కొనసాగించడానికి ‘పంచక్రియలను’ అనుసరించ వలసి ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
ఉపాసన … ఉత్సవం … అహింస … తీర్థయాత్ర … సంస్కారం అనేవి పంచక్రియలుగా చెప్పబడుతున్నాయి.
నియమ నిష్ఠలను పాటిస్తూ … సంప్రదాయాన్ని గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో అనుదినం భగవంతుడిని ఆరాధించాలని ‘ఉపాసన’ చెబుతోంది.
చక్కని కుటుంబ వాతావరణాన్ని కలిగి వుండి, పండుగ సందర్భాల్లో జరిగే వేడుకల్లోను … దైవ సంబంధమైన ఉత్సవాల్లోను భక్తితో పాల్గొనాలని ‘ఉత్సవం’ స్పష్టం చేస్తోంది.
ఇక ఇతరులకు ఏ విధంగాను కష్టాన్ని కలిగించకుండా … ఎలాంటి కారణం చేతను వాళ్లను హింసించకుండా నడచుకోవాలని ‘అహింసా’ విధానం తెలియజేస్తోంది.
బరువు బాధ్యతల పేరుతో భగవంతుడిని దర్శించడం … సేవించడం మరిచిపోకూడదని చెప్పడానికే ‘తీర్థయాత్రలు’ ఉద్దేశించబడ్డాయి.
తీర్థయాత్రలు … ప్రతి ఒక్కరి మనసుని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. భగవంతుడి సన్నిధిలో గడపడం వలన కలిగే ఆనందానుభూతులు ఎలా ఉంటాయో తెలియజేస్తాయి.
ఇక పుట్టుక నుంచి మరణం వరకూ ఆచారవ్యవహారాల పేరుతో పూర్వీకుల నుంచి సంక్రమించిన పద్ధతులను పాటించడమే ‘సంస్కారం’గా చెప్పబడుతోంది.
తరతరాలుగా వస్తోన్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ .. సంప్రదాయాలను గౌరవిస్తూ … ఇతరులను ప్రేమిస్తూ … భగవంతుడిని సేవిస్తూ … పుణ్య క్షేత్రాలను దర్శించమనే ‘పంచక్రియలు’ చెబుతున్నాయి.
వీటిని అనుసరించడం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
– వి. లక్ష్మి శేఖర్
Panchakriyalu,V Lakshmi Shekhar,Telugu Kavithalu