పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా? : కేటీఆర్

2025-02-28 10:07:40.0

మంత్రులు హెలికాప్టర్ యాత్రలు చేస్తూ.. చేపకూర విందులతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కేటీఆర్ మండిప‌డ్డారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదంలో ఓ వైపు విషాదం నెలకొంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులతో వినోదం పొందుతున్నారని దుయ్యబట్టారు. హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు ఉంచుతున్నార‌ని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంద‌న్నారు. “అన్నం వండలేదు గుడిలో తినండి” అని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది విద్యార్థులకు ఆదేశాలు ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్ట‌ల్‌లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారు.

అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి హాస్ట‌ల్ సిబ్బంది వంట చేయ‌డం మానేశార‌ని కేటీఆర్ తెలిపారు. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక విద్యార్థులు పస్తులు ఉన్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా, అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏంటి అని విద్యార్థుల త‌ల్లిదండ్రులు తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

MLC Kavitha,CM Revanth Reddy,BRS Party,Minister Jupalli Krishna Rao,Nagar Kurnool District,KCR,KTR,Congress party,Atchampet Constituency,Balmuru Mandal,Kondanagula ST Boys Hostel,Telangana goverment,Praja palana