పరిమితి (Devotional)

2015-08-07 13:01:41.0

ఎవరి పరిధులు వారికుంటాయి. ఎవరి పరిమితులు వారికుంటాయి. వాటినిబట్టే అవగాహన ఉంటుంది. కానీ మన పరిధుల్ని, పరిమితుల్ని అంగీకరిస్తూనే వాటిని దాటిన విశాలమైన ప్రపంచముందని మనం అంగీకరించాలి. దాన్నే వివేకమంటారు. కానీ సాధారణంగా జనం దాన్ని ఆమోదించరు. అంగీకరించరు. కారణం భయం. తమకు తెలియని దానిపట్ల భయం. అందువల్ల తమకు తెలిసిందే సర్వస్వమనుకుంటారు. తలుపులు మూసుకుంటారు. దేన్నీ అనుమతించరు, ఆమోదించరు. హంస పరిశుభ్రతకు, పరిపూర్ణతకు, విశాలత్వానికి సంకేతం. హంస విహాయసంలో విహరిస్తుంది. నిర్మలంగా సంచరిస్తుంది. సాధారణంగా హంసలు […]

ఎవరి పరిధులు వారికుంటాయి. ఎవరి పరిమితులు వారికుంటాయి. వాటినిబట్టే అవగాహన ఉంటుంది. కానీ మన పరిధుల్ని, పరిమితుల్ని అంగీకరిస్తూనే వాటిని దాటిన విశాలమైన ప్రపంచముందని మనం అంగీకరించాలి. దాన్నే వివేకమంటారు. కానీ సాధారణంగా జనం దాన్ని ఆమోదించరు. అంగీకరించరు. కారణం భయం. తమకు తెలియని దానిపట్ల భయం. అందువల్ల తమకు తెలిసిందే సర్వస్వమనుకుంటారు. తలుపులు మూసుకుంటారు. దేన్నీ అనుమతించరు, ఆమోదించరు.

హంస పరిశుభ్రతకు, పరిపూర్ణతకు, విశాలత్వానికి సంకేతం. హంస విహాయసంలో విహరిస్తుంది. నిర్మలంగా సంచరిస్తుంది. సాధారణంగా హంసలు మానస సరోవరంలో నివసిస్తాయని అంటూవుంటారు. ఒక హంస ఎన్నెన్నో ప్రదేశాల్లో సంచరించి అలసిపోయింది. ఒక సరోవరం తరువాత ఇంకో సరోవరానికి తిరిగింది. దానికి విశ్రాంతి తీసుకోవాలనిపించింది. ఎగురుతూ ఉంటే ఒక బావి కనిపించింది. ఆ బావి గోడమీద వాలింది.

బావిలో కప్పలుంటాయి. కప్పలకు బావే ప్రపంచం. బాహ్య ప్రపంచం గురించి తెలియదు, పట్టింపూ ఉండదు.

హంస బావి గోడమీద వాలిన శబ్దానికి బావిలో కప్ప నీటిపైకి వచ్చింది. హంసను చూస్తూనే దానికి ఉత్సాహం కలిగింది. దాంతో మాట్లాడాలనిపించింది.

“ఎవరు నువ్వు? ఎక్కడినించీ వచ్చావు?” అంది. హంస “నన్ను హంస అంటారు. నేను మానస సరోవరంనించీ వచ్చాను” అంది. ఇంకా నా ఆహారం ముత్యాలు. ముత్యాలు తిని బతుకుతాను అంది.

కప్ప “నువ్వు ఉంటున్న ఆ సరోవరం పెద్దదా?” అంది.

హంస “అవును. చాలాపెద్దది” అంది. కానీ కప్పకు బావిని మించిన విశాలమైన సరస్సులు ఉంటాయని తెలియదు.

బావిలో అంచునించీ ఒక గెంతు గెంతి” మీ సరోవరం ఇంత పెద్దగా ఉంటుందా?” అంది. హంస “కాదు, మరింత పెద్దది” అంది.

కప్ప కొంత దూరం ఈది నీటిని వలయాలుగా కదిలించి “ఐతే ఇంత పెద్దగా ఉంటుందనుకుంటాను” అంది.

హంస “కాదు, చాలా చాలా పెద్దది” అంది.

కప్ప బావి అంచుల గుండా పూర్తిగా తిరిగి “దీన్ని బట్టి ఇంత పెద్దగా ఉంటుందని తెలుస్తోంది. ఈ బావి ఎంతదో నీ సరోవరం అంతదన్నమాట” అంది.

హంస “కాదు, సరోవరం ఈ బావి కన్నా చాలా పెద్దది” అంది.

అంచులో నిల్చున్న కప్ప “నీకు ఏమీ తెలిసినట్లు లేదు, తెలివి లేదు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఈ బావికన్నా గొప్పది, పెద్దది ఎక్కడయినా ఉంటుందా? తెలియకపోతే తెలీదని ఒప్పుకోవాలి” అని ధబీమని నీటిలోకి దూకింది.

హంస నవ్వుకుంటూ ఎగిరిపోయింది.

తెలియని వాళ్ళు తెలుసుననుకుంటారు.

తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటారు.

– సౌభాగ్య

Devotional Stories,Limitation,Telugu Devotional Stories,పరిమితి

https://www.teluguglobal.com//2015/08/08/devotional-story-on-limitation/