పీసీఓఎస్ అంటే ఏంటి ? ఎలా తగ్గించుకోవాలి ?

2023-11-24 11:52:51.0

పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రతి ఐదుగురు యువతులలో ఒకరు పీసీఓఎస్‌ బారిన పడుతున్నారు.

https://www.teluguglobal.com/h-upload/2023/11/24/861226-pcos.webp

పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రతి ఐదుగురు యువతులలో ఒకరు పీసీఓఎస్‌ బారిన పడుతున్నారు. దీని కారణంగా నెలసరి క్రమం తప్పడం, జుట్టు రాలడం, మొటిమలు, అవాంచిత రోమాలు, అలసట, బరువు పెరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే వయసు పెరిగిన తరువాత సంతానలేమి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యను శాశ్వతంగా నయం చేయలేం కానీ వైద్య చికిత్స సహాయంతో కొన్ని రకాల సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్లో మార్పులు, నియమాలతో కూడిన ఆహారపు అలవాట్లతో పీసీఓఎస్‌ని నియంత్రణలో పెట్టుకోవచ్చు.

పీసీఓఎస్ సమస్యను గుర్తించిన తరువాత డాక్టర్ ను సంప్రదించి మందులు వాడటంతో పాటు తీసుకొనే ఆహారం పట్ల కూడా శ్రద్ద తీసుకోవాలి. ఒక అధ్యయనం ప్రకారం, చేపలు, మాంసం, గుడ్లు, చీజ్‌, పెరుగు వంటి ఆహారాలు బరువు తగ్గడానికి, వారి సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి, వారి కొలెస్ట్రాల్ స్థాయిలను ఆప్టిమైజ్ చేయడానికి, పీరియడ్స్‌ టైమ్‌కు రావడానికి సహాయపడతాయి. ఈ పీసీఓఎస్ తో బాధపడే వారిలో కొంతమందికి పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. అలాంటి కేసుల్లో వారికి ఐరన్ లోపం తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాలకూర, కోడిగుడ్లు, బ్రోకొలి వంటి ఆహార పదార్థాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. మెగ్నీషియం కోసం బాదాం, కాజు, పాలకూర, అరటి పండ్లు, జీర్ణశక్తి పెరిగదానికి ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.

పీసీఓఎస్‌ ఉన్నవారిలో.. డయాబెటిస్‌, గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌ వచ్చే ముప్పు పెరుగుతుంది. అలాగే వీరు కొన్ని ఆహారాలు తీసుకుంటే వ్యాధి లక్షణాలు మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే రెడ్‌ మీట్‌, పౌల్ట్రీ మాంసం ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ స్థాయిలను పెంచుతాయి. ఇది మీ PCOS లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అధికంగా ప్రాసెస్ చేసిన సోయా ఉత్పత్తులలో ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి. ఇక కాఫీ, కూల్‌ డ్రింక్స్‌, టీ వంటి డ్రింక్స్‌లో కెఫిన్‌ అధికంగా ఉంటుంది. కెఫిన్‌ ఎక్కువగా తీసుకుంటే ఆల్కహాల్‌ లాగానే .. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది.

ఇక ఒత్తిడి PCOS లక్షణాలను, తీవ్రతరం చేస్తుంది. అందుకే తినే ప్రతి పదార్ధాలతో పాటు మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను పాటించాలి. ఒత్తిడిని తగ్గించడం కూడా హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.

PCOS,Health Tips,Polycystic Ovary Syndrome,Health tips for women