2023-07-26 12:08:16.0
పీసీఓఎస్ సమస్య వలన పునరుత్పత్తి వ్యవస్థే కాదు… మొత్తం ఆరోగ్యం ప్రభావితమవుతుంది.
https://www.teluguglobal.com/h-upload/2023/07/26/800599-pcos.webp
ఈ రోజుల్లో చాలామంది మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యని ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. దీనిని పీసీఓఎస్ గా పిలుస్తుంటాం. పీసీఓఎస్ అనేది ఒక రకమైన హార్మోన్ల స్థితి. ఇది ఎందుకు ఏర్పడుతుంది అనే ప్రశ్నకు కచ్ఛితమైన సమాధానం లేదు కానీ జన్యువులు ప్రధాన పాత్రని పోషిస్తాయనే ఆధారాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవటం కూడా ఇందుకు కారణం కావచ్చు.
దీనివలన అండాశయాల్లో ఆండ్రోజెన్స్ అనే మగ హార్మోన్లు హెచ్చుస్థాయిలో పెరిగి అండాశయ పనితీరుని దెబ్బతీస్తాయి. ఆండ్రోజెన్స్ ఎక్కువ స్థాయిలో ఉండటం వలన అండాశయం నుండి అండాలు విడుదల కావు. దాంతో సంతానం పొందటంలో ఆటంకాలు ఎదురవుతాయి. పీసీఓఎస్ వలన మొహంపై మొటిమలు, జుట్టు రావటం లాంటి సమస్యలు సైతం ఉంటాయి. సుమారు ఐదునుండి పది శాతం మంది మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఉంటుందనేది ఓ అంచనా. అందుకే దీనిని వైద్యులు పునరుత్పత్తి దశలో ఉన్న మహిళల్లో కనిపించే సాధారణమైన డిజార్డర్ గా పరిగణిస్తున్నారు.
పీసీఓఎస్ సమస్య వలన పునరుత్పత్తి వ్యవస్థే కాదు… మొత్తం ఆరోగ్యం ప్రభావితమవుతుంది. ఈ సమస్య ఉన్న స్త్రీలకు టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే అధిక బరువుకి కూడా గురవుతుంటారు. మానసిక స్థితి స్థిరంగా ఉండదు. మూడ్ డిజార్డర్లు ఉంటాయి. ఆత్మగౌరవం లోపిస్తుంది. అలసట, పగటి నిద్ర , శరీరంలో జీవక్రియలు సరిగ్గా లేకపోవటం లాంటి సమస్యలు ఉంటాయి. జీవనవిధానంలో, ఆహారంలో మార్పుల ద్వారా పీసీఓఎస్ ని అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది.
ఈ సమస్య ఉన్న స్త్రీలు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
-పీచు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పళ్లు కూరగాయలు ముడి ధాన్యాలు మొదలైన ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ నలభై గ్రాముల వరకు పీచుని పొందాల్సి ఉంటుంది. దీనివలన వారి పొట్ట ఆరోగ్యం బాగుంటుంది. హార్మోన్లు సమతౌల్యంలో ఉంటాయి.
-ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవటం చాలా అవసరం. ఇందుకోసం గింజలు, విత్తనాలు, ఆవు పాలు, నెయ్యి, కోల్డ్ ప్రెస్డ్ పద్ధతిలో తయారైన నువ్వులు, కొబ్బరి, సన్ ఫ్లవర్ లాంటి ఆయిల్స్ ని వాడాలి. మనశరీరంలో హార్మోన్లు కొలెస్ట్రాల్ తో తయారవుతాయి. అందుకే మన హార్మోన్ల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.
-కెఫీన్ ఉన్న కాఫీ టీ శీతల పానీయాలు వంటివాటిని ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ హార్మోన్లపై తీవ్రమైన ప్రభావం చూపి, పీసీఓఎస్ లక్షణాలను మరింతగా పెంచుతుంది.
-మొక్కల ద్వారా లభించే ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. పప్పు ధాన్యాలు, శనగలు, చిక్కుళ్లు, గింజలు విత్తనాలు వంటి ఆహారాల ద్వారా ప్రొటీన్లను ఎక్కువ స్థాయిలో పొందవచ్చు. ఈ ఆహారాల వలన శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది.
-కంటి నిండా నిద్రపోవాలి. సరైన నిద్రలేకపోతే ఊబకాయం, ఇన్సులిన్ పనితీరు మందగించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ రెండు అంశాలు పీసీఓఎస్ సమస్యకు దారితీస్తాయి. పీసిఓఎస్ కి గురయినవారు చేసుకోవాల్సిన జీవనశైలి మార్పుల్లో సరైన నిద్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయటం కూడా చాలా అవసరం.
పీసీఓఎస్ ఉన్నవారందరిలో ఒకేరకమైన లక్షణాలు ఉండాలని లేదు. కనుక వైద్యుల సలహా మేరకు తమ జీవనశైలిలో అవసరమైన మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలతో పీసీఓఎస్ ఉన్నవారికి సంతానం కలగటంలో ఏర్పడిన అవరోధాలు సైతం తొలగుతాయి.
PCOS,Polycystic Ovary Syndrome,Health Tips,Telugu News,Women Health Problems