పుష్పపై పవన్‌ కామెంట్స్.. సోషల్ మీడియాలో రచ్చ

2024-08-08 12:08:31.0

గతానికి ఇప్పటికీ సినిమాల పరిస్థితి చాలా మారిందన్నారు పవన్‌. తాను సినిమా ఇండస్ట్రీకి చెందినవాడినే అయినా, అలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టం ఉండదన్నారు.

https://www.teluguglobal.com/h-upload/2024/08/08/1350803-ap-deputy-cm-pawan-kalyans-interesting-comments-on-allu-arjun-pushpa-movie.webp

కర్ణాటక పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య‌, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు పవన్‌. ఈ సందర్భంగా పవన్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌మీడియాలో ఆస‌క్తిక‌ర చర్చకు దారి తీశాయి.

ఇంతకీ పవన్‌ కల్యాణ్ ఏమన్నారంటే..

తనకు కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ నటించిన గందద గుడి సినిమా ఇష్టమని చెప్పారు పవన్‌కల్యాణ్. ఆ సినిమాలో అడవిని రక్షించే అధికారిగా రాజ్‌కుమార్ నటించారని చెప్పారు. గతంలో హీరోలు అడవిని రక్షించే పాత్రల్లో నటిస్తే.. ప్రస్తుతం అడవులను నరికేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారంటూ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. గతానికి ఇప్పటికీ సినిమాల పరిస్థితి చాలా మారిందన్నారు పవన్‌. తాను సినిమా ఇండస్ట్రీకి చెందినవాడినే అయినా, అలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టం ఉండదన్నారు. అసలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నామన్న అభిప్రాయం నాలో వ్యక్తమవుతుందన్నారు.

పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో చర్చకు దారి తీశాయి. పుష్పను ఉద్దేశించే పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్‌ రెడ్డికి అల్లు అర్జున్‌కు మద్దతు తెలపడం వివాదానికి దారి తీసింది. అప్పటి నుంచి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మ‌ధ్య విబేధాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం ఉంది.