పూర్వ జన్మ పుణ్యం (Devotional)

2015-08-11 13:01:52.0

ఒక ఆశ్రమంలో గురువు దగ్గర కూర్చున్న శిష్యులకు పాపపుణ్య వివరాలగురించి వివరించాడు. భారతీయుల్లో హిందువులు పునర్జన్మల్ని విశ్వసిస్తారు. పూర్వజన్మల పుణ్యపాపాల పర్యవసానాలు ఈ జన్మలో ఉంటాయన్నాడు. ఉదాహరణకి పరీక్షిత్తు మహారాజు నవ్వులాటకు శమీక మహర్షి మెడలో చచ్చినపామును వెయ్యగా ఫలితంగా తక్షకుని చేతిలో చనిపోయిన విషయం చెప్పాడు. మన చర్యలే మన మంచి చెడ్డలకి కారణమన్నారు. ఒక శిష్యుడు “గురుదేవా! భారతంలో ద్రౌపది సాధ్వి! ఆమెను నిండు సభలో వివస్త్రను చెయ్యమని దుర్యోధనుడు ఆదేశించాడు. దుశ్శాసనుడు సమస్త […]

ఒక ఆశ్రమంలో గురువు దగ్గర కూర్చున్న శిష్యులకు పాపపుణ్య వివరాలగురించి వివరించాడు. భారతీయుల్లో హిందువులు పునర్జన్మల్ని విశ్వసిస్తారు. పూర్వజన్మల పుణ్యపాపాల పర్యవసానాలు ఈ జన్మలో ఉంటాయన్నాడు.

ఉదాహరణకి పరీక్షిత్తు మహారాజు నవ్వులాటకు శమీక మహర్షి మెడలో చచ్చినపామును వెయ్యగా ఫలితంగా తక్షకుని చేతిలో చనిపోయిన విషయం చెప్పాడు. మన చర్యలే మన మంచి చెడ్డలకి కారణమన్నారు.

ఒక శిష్యుడు “గురుదేవా! భారతంలో ద్రౌపది సాధ్వి! ఆమెను నిండు సభలో వివస్త్రను చెయ్యమని దుర్యోధనుడు ఆదేశించాడు. దుశ్శాసనుడు సమస్త సభికులు చూస్తూ ఉండగా ఆమెను వివస్త్రను చెయ్యడానికి ప్రయత్నించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు వస్త్రదానం చేశాడు. దానికి సంబంధించి దాని పూర్వరంగం వివరించండి” అని అడిగాడు.

గురువు “ద్రౌపది పూర్వజన్మలో ఒక పుణ్య తీర్ధంలో స్నానానికి వెళ్ళింది. ఆ రోజు ఒక పండుగదినం. వివిధ ప్రాంతాల నించి ఎందరో పుణ్యస్నానాలు చెయ్యడానికి తండోపతండాలుగా వచ్చారు.

ఆమె స్నానానికి దిగింది. ఎందరో తీర్ధంలో మునకలు వేస్తున్నారు. స్నానాలు చేసి వెళుతున్నారు. కొందరు వెళుతూ ఉంటే మరికొందరు వస్తున్నారు. ద్రౌపది దూరంగా ఒక సాధువు చాలా సేపటి నించీ నీళ్ళలోనే నిలబడి ఉండడం చూసింది. అతనికి ఉన్నది ఒకటే కౌపీనం. నీళ్ళలో మునిగి తేలుతూ ఉంటే అది జారిపోయి ప్రవాహంలోపడి కొట్టుకుపోయింది.

అతని అవస్థ గమనించిన ద్రౌపది తన కొంగును చింపి అతనికి ఇచ్చింది. అతను ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు.

అట్లా ఒక సన్యాసిని ఆదుకున్నందుకు ప్రతిఫలంగా భారతకాలంలో ద్రౌపది మానభంగం కాకుండా కృష్ణభగవానుడు ఆమెను ఆదుకున్నాడు.

మనుషులు తాము చేసే చర్యలపట్ల అప్రమత్తంగా ఉండాలి. మనం మంచిపనులు చేస్తే తప్పక వాటికి ప్రతిఫలం ఉంటుంది. పూర్వజన్మ పుణ్యఫలమంటే అదే!

– సౌభాగ్య

Devotional Stories,Telugu Devotional Stories,పూర్వ జన్మ పుణ్యం

https://www.teluguglobal.com//2015/08/12/devotional-story-on-poorva-janma/