http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/health-1.gif
2016-06-07 04:28:09.0
వృద్ధాప్యాన్ని హుందాగా, ఆనందంగా ఆహ్వానించాలంటే చాలా సాహసం ఉండాలి…అంతకుమించి ఉండాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నపుడు వయసు మీరటం అనేది గుదిబండగా మారదు. గుండె వ్యాధులు, కీళ్ల నొప్పులు, అధికబరువు, బిపి, షుగరు…ఇవన్నీ పెరుగుతున్న వయసు… వద్దంటున్నా తెచ్చిపెట్టే కానుకలు. వీటిబారిన పడకుండా జీవితంలో ముందుకు వెళ్లాలంటే…మనకు తోడుగా నిలిచేది పీచు పదార్థాలే అంటున్నారు పరిశోధకులు. ఆస్ట్రేలియాలోని వెస్ట్‌మెడ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చి పరిశోధకులు చెబుతున్నదాన్ని బట్టి సరైన పరిమాణంలో పీచుఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటే […]
వృద్ధాప్యాన్ని హుందాగా, ఆనందంగా ఆహ్వానించాలంటే చాలా సాహసం ఉండాలి…అంతకుమించి ఉండాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నపుడు వయసు మీరటం అనేది గుదిబండగా మారదు. గుండె వ్యాధులు, కీళ్ల నొప్పులు, అధికబరువు, బిపి, షుగరు…ఇవన్నీ పెరుగుతున్న వయసు… వద్దంటున్నా తెచ్చిపెట్టే కానుకలు. వీటిబారిన పడకుండా జీవితంలో ముందుకు వెళ్లాలంటే…మనకు తోడుగా నిలిచేది పీచు పదార్థాలే అంటున్నారు పరిశోధకులు.
ఆస్ట్రేలియాలోని వెస్ట్‌మెడ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చి పరిశోధకులు చెబుతున్నదాన్ని బట్టి సరైన పరిమాణంలో పీచుఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటే వృద్ధాప్యంలో వ్యాధులు, ఇతరులపై ఆధారపడే పరిస్థితులకు దూరంగా ఉండవచ్చు. పీచుపదార్థాలు మనకు చెట్లనుండి వచ్చే ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ల నుండి లభిస్తాయి. జంతుసంబంధిత ఆహారంలో పీచు ఉండదు. యాభై, ఆపై వయసున్న 1600మందిపై దీర్ఘకాలం అధ్యయనం నిర్వహించి వారు తీసుకునే ఆహారాన్ని, వారి పంచేంద్రియాల సామర్ధ్యం తగ్గిపోవటం, వ్యాధులకు గురికావటం…అనే అంశాలను పరిశీలించారు.
పీచు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్న వారు వయసు మీద పడుతున్నా చాలా హాయిగా, ఎలాంటి సమస్యలకు గురికాకుండా ఉండటం స్పష్టంగా గుర్తించారు. దీన్ని బట్టి పీచు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే…సక్సెస్‌ఫుల్ ఏజింగ్ అనేదాన్ని సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నవారికి డిప్రెషన్ లక్షణాలు, మెదడు మందగించడం, శాసకోశ సమస్యలు, క్యాన్సర్, గుండెజబ్బులు లాంటి తీవ్రవ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించారు. అంతేకాదు, అధికబరువు, మధుమేహం లాంటివి కూడా దూరంగా ఉంటాయి. వయసు పెరుగుతున్నా జీర్ణశక్తి చురుగ్గా ఉంటుంది.
పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నవారు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశాలు 80శాతం పెరిగినట్టుగా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. కనుక వృద్ధాప్యం హాయిగా ఉండాలంటే చిన్న వయసునుండే పీచుతో అనుబంధం పెంచుకోవటం మంచిది మరి.
https://www.teluguglobal.com//2016/06/07/పెరుగుతున్న-వయసుకి-పీ/