పేదింటి బిడ్డలను విదేశీ విద్యకు దూరం చేస్తరా?

2025-02-08 11:55:11.0

ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్‌

పేదింటి బిడ్డలను విదేశీ విద్యకు దూరం చేస్తారా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులతో శనివారం ఆమె జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. 200 మందికి పైగా విద్యార్థులు ఈ మీటింగ్‌లో పాల్గొని తాము స్కాలర్‌షిప్‌లు రాక పడుతున్న అవస్థలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, కేసీఆర్‌ ప్రభుత్వం సదుద్దేశంతో ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం తెస్తే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. పేదింటి బిడ్డలకు విదేశీ విద్య అందాలన్నదే కేసీఆర్‌ ఆలోచన అని తెలిపారు. రెండో విడత నిధుల కోసం వివిధ దేశాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే వారికి స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తారు కానీ పేదింటి బిడ్డలకు చదువులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లతో పాటు ఫీ రీయింబర్స్‌మెంట్‌, ఇతర స్కాలర్‌షిప్‌లు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా మొద్దునిద్ర వీడాలని.. లేకుంటే ప్రజక్షేత్రంలో పోరాడి ముక్కుపిండి నిధులు విడుదల చేయించుకుంటామని హెచ్చరించారు.

Ambedkar Overseas Scholarships,Foreign Education to Poor,KCR,Kavitha,BRS,Congress,Revanth Reddy