http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/small-and-havy.gif
2016-03-20 03:31:33.0
పొట్టిగా ఉన్న మగవాళ్లు, లావుగా ఉన్న ఆడవాళ్లు జీవితంలో ఎక్కువ సంపాదించలేరని ఒక అధ్యయనం గణాంకాలతో సహా తేల్చి చెబుతోంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించినవారు మొత్తం 1,19,669మంది బ్రిటీష్ వ్యక్తులకు సంబంధించిన జన్యుపరమైన అంశాలను సేకరించారు. వీరంతా 37నుండి 73 ఏళ్ల వరకు వయసున్నవారు. పొడుగ్గా ఉన్న మగవారి సాంవత్సరిక సంపాదన, పొట్టిగా ఉన్నవారికంటే 4,175డాలర్ల వరకు ఎక్కువగా ఉన్నట్టుగా గమనించారు. వారు పుట్టి పెరిగిన వాతావరణం, పౌష్టికాహారం, చదువు, తెలివితేటలు… వీటితో సంబంధం లేకుండా ఎత్తు […]
పొట్టిగా ఉన్న మగవాళ్లు, లావుగా ఉన్న ఆడవాళ్లు జీవితంలో ఎక్కువ సంపాదించలేరని ఒక అధ్యయనం గణాంకాలతో సహా తేల్చి చెబుతోంది. ఈ అధ్యయనాన్ని నిర్వహించినవారు మొత్తం 1,19,669మంది బ్రిటీష్ వ్యక్తులకు సంబంధించిన జన్యుపరమైన అంశాలను సేకరించారు. వీరంతా 37నుండి 73 ఏళ్ల వరకు వయసున్నవారు. పొడుగ్గా ఉన్న మగవారి సాంవత్సరిక సంపాదన, పొట్టిగా ఉన్నవారికంటే 4,175డాలర్ల వరకు ఎక్కువగా ఉన్నట్టుగా గమనించారు. వారు పుట్టి పెరిగిన వాతావరణం, పౌష్టికాహారం, చదువు, తెలివితేటలు… వీటితో సంబంధం లేకుండా ఎత్తు పెరగడానికి దోహదం చేసే జన్యువులు ఉన్నవారు ఎక్కువగా సంపాదించినట్టుగా తేలింది. అయితే మహిళల విషయంలో ఇది వర్తించలేదు.
మహిళల విషయానికి వస్తే శరీర బరువు పెరిగేందుకు తోడ్పడే జన్యువులు ఉన్న మహిళలు సంపాదనలో వెనుక బడి ఉన్నట్టుగా గుర్తించారు. లావున్న మహిళలు సన్నపాటి వారికంటే సంవత్సరానికి 2,684 డాలర్లు తక్కువ సంపాదన కలిగి ఉన్నారు. అయితే లావు, సన్నం అనేది పురుషుల్లో సంపాదన విషయంలో ప్రభావం చూపలేదు.
ఆడా మగా తేడా లేకుండా పొట్టి, బరువు అనే అంశాలు మనుషులపై ఎలా ప్రభావం చూపుతాయి అనే అంశాన్ని సైతం పరిశీలించినపుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. శరీరాన్ని సన్నగా ఉంచే జీన్స్ ఉన్నవారు, లావుని పెంచే జన్యువులు ఉన్నవారికంటే ఎక్కువగా చదువుతున్నట్టుగా గుర్తించారు. లావుని పెంచే జీన్స్ ఉన్నవారు నైపుణ్యం అంతగా అవసరం లేని వృత్తుల్లో ఉన్నారు. పొడుగుకి కారణమయ్యే జీన్స్ ఉన్న ఆడవారు, మగవారు కూడా ఉన్నత చదువులు ఎక్కువగా చదువుతున్నారు. అంతే కాదు, వీరు నైపుణ్యంలేని శ్రామికులుగా కాకుండా ప్రొఫెషనల్స్‌గా ఎదుగుతున్నట్టుగా గమనించారు. పొడుగ్గా ఉన్న మగవారే ఉన్నత స్థాయి పదవుల్లో ఎక్కువగా ఉండటం అధ్యయనవేత్తలు గుర్తించారు. అమెరికా అధ్యక్షుల సగటు ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు…అనే ఉదాహరణని వీరు చూపుతున్నారు.
డ్యూక్ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం 5అడుగుల10 అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉన్న మగవారు, తాము తగ్గిన ప్రతి అంగుళం ఎత్తుకి 30వేల డాలర్లు ఎక్కువ సంపాదిస్తే కానీ మహిళలను ఆకట్టుకోలేరని తేలింది. అలాగే లావుగా ఉన్న మహిళలు ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందటంలో, మగవారిని ఆకట్టుకోవడంలో సన్నగా ఉన్న ఆడవారికంటే వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.
అయితే పొడుగు పొట్టి లావు సన్నం అనేవి మనచేతుల్లో లేనివి కదా అని నిరాశపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆకారం, తీరు ఎలా ఉన్నా, వాటితో సంబంధం లేకుండా మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చనే వెసులుబాటు ఒకటి ఉంది కనుక. మనిషి తన ఆలోచనలు మార్చుకుంటే తనకు పుట్టుకతో వచ్చిన జన్యువులతో కూడా పోరాటం చేసి విజయాలు సాధించవచ్చనేది నిజం. అలాగే నేటి తరం ఆలోచనలు మారితే అవి తరువాత తరాల డిఎన్ఎని సైతం మారుస్తాయనేది సైంటిఫిక్‌గా రుజువైన సత్యం.
https://www.teluguglobal.com//2016/03/20/పొట్టి-మగవారు-లావున్న/