2025-01-04 11:13:40.0
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యయనం బాధ్యతలను ఐఐటీ హైదరాబాద్‌కు అప్పగించింది. నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం నిర్మాణం నేపథ్యంలో రాష్ట్రంపై ప్రభావం ఎంత మేరకు పడుతుందో తెలుసుకునేందుకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక తయారు చేయాలని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో కో ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో భద్రాచలం వద్ద ముంపునకు గురైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిందని వివరించారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎంకు అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే.. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు. భద్రచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది.
CM Revanth reddy,Polavaram project,Andhra Pradesh,CM Chandrababu,Power point presentation,Godavari River Management Board,AP Goverment,Bhadrachalam temple