పోస్త్యుమస్అవార్డ్

2023-01-15 15:59:14.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/15/435424-army-day.webp

2020 లో ఆర్మీ డే సందర్భంగా వ్రాసినది

మనిషి మరణించాక

మరిచిపోయిన మంచినంతా

మూటగట్టి మూలధనం దానం చేసినంత ముచ్చటగా … మూర్తీభవించిన మానవతతో మిగిలినోళ్ళ కళ్ళు తుడిచి

గౌరవ పురస్సరంగా

ప్రదానం చేసే పురస్కారమే

ఈ ఎవార్డ్

అదే … బతికున్నప్పుడంతా

పెద్ద బూరెల గంప ఆ మనిషి వచ్చి పడటం కోసమే ఎదురుచూస్తున్నట్టూ

ఆ మనిషి తినబోయే రొట్టె

ఏదో ఒకనాడు విరిగి నేతిలో పడే అవకాశమున్నట్టూ …

కోతలు కోసి, శ్రమ దోపిడీ చేసి అప్పుడప్పుడూ కుక్క బిస్కెట్ల లాంటి పనికిమాలిన తాయిలాలిచ్చి తైతక్కలాడించడం

ఒక ప్రాక్టికల్ క్రూడ్ జోక్

మేషాండ భ్రమే అని తెలిసినా

ఆశ గా ఎదురు చూడటం మానవుడి లోని నక్క నైజం

పాపం ఆ ఆశల పల్లకిలో

డోలలాడుతూ భవిష్యత్తు లో ఎపుడో భోగభాగ్యాలతో తులతూగుతానని కలల్లో ఓలలాడుతూ … ఇవ్వాళ మరణించడానిక్కూడా సిద్ధపడ్డ సైనికుడూ, కార్మికుడూ, మానధనుడూ, అభిమానధనుడూ …

ఆ జానెడో, బానెడో పొట్టకోసం పడే ఆరాటం, చేసే పోరాటం

ఆ మరణానంతర మర్యాదల కోసమేనా ?

కాకపోవచ్చు…

అవమానాలని దిగమింగి “అయ్య గారి” అవాకులకి చవాకులకీ కేవలం బతుకుతెరువు కోసం జైకొట్టేవాడు ఆర్డర్లీ అయినా …ఆఫీసరైనా

అది హృదయపూర్వకం కాదు

హి ఈజ్ ఎ హంగ్రీ హార్స్

డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్

టు విన్ ద రేస్ …

ప్లేజ్ ఫీడ్ హిమ్ …

ఆశలని ఆదరించు

అనుభవాన్ని అక్కునచేర్చుకో అవసరానికి ఆధారమవ్వు

ఆత్మగౌరవాన్ని అభినందించు

అవమానించడాన్ని విసర్జించు

లేకుంటే

ఆ రక్షకుడే భక్షకుడయ్యే ప్రమాదముంది

సైనికుడుదీ ఉద్యోగమే

ఊడిగం కాదు

నీ పరువూ, నీ దేశ గౌరవం నిలబెట్టడానికి ముందు నిలబడే బలశాలిని బలహీనుడనుకుంటే

నీ తలబరువుకే బలైపోతావ్

ఆ త్యాగమూర్తి పెట్టిన శాపాలకి తగలడిపోతావ్

పదోన్నతైనా, పతకమైనా

పైసలైనా, పరమవీరచక్ర అయినా …

పదుగురికీ చెప్పుకునే లా ఉసురున్నప్పుడే ఇచ్చెయ్

పోయాక ఇచ్చే పోస్త్యుమస్ ఎవార్డులు ఆర్చవూ, తీర్చవూ

ఆత్మలకు శాంతినివ్వవు

– సాయి శేఖర్

Saye Sekhar,Posthumous award,Telugu Kavithalu,Army Day