ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన

2025-01-21 10:59:12.0

గ్రామ సభల సాక్షిగా రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందన్న మాజీ మంత్రి

ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని, మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా విమర్శించారు. ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందన్నారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే కాంగ్రెస్‌ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె అని నిలదీశారు.ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటన్నారు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా.? అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారిందని, సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొన్నదన్నారు.

మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా..ఆరు గ్యారెంటీలు అమలు దగా.. రుణమాఫీ చేయడం దగా..పంట బోనస్ ఇవ్వడం దగా..రైతు భరోసా అమలు దగా..రేషన్ కార్డుల జారీ దగా..ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా.. అని ధ్వజమెత్తారు. ఏడాది కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నరు. సర్కార్‌ చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నరన్ని తెలిపారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తరు. అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తరు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తున్నది. అడుగడుగునా ప్రశ్నిస్తున్నది. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతరు. ఎంత మందిని అరెస్టులు చేస్తరని నిలదీశారు. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ రాక్షస పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించకముందే కళ్లు తెరవండి. ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించండని సూచించారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Harish Rao,Fire on Congress Government,Congress Failed Full Fill Six Guarantees,Betrayed Telangana People,Villagers Protest,At Praja Palana,Grama Sabhalu