2023-02-17 12:51:05.0
https://www.teluguglobal.com/h-upload/2023/02/17/723515-pra-ayini.webp
నీ కనులు
జంట మీనములై
నా ఎద సరస్సున జారి తృళ్లిపడనేల?
నా మది పులకించి
అనురాగాల
మధురాగం ఆలపించెనేల?
భృకుటిద్వయం
మరునివిల్లయి
చూడ్కులు విరిబాణములై
నా హృదయాన్ని
గాయం చేయనేల?
రుధిరంలా
తీయని బాధ
నాలో చిమ్మ నేల?
శుద్ధ అష్టమి
చంద్రుడై
తెలి వెన్నెలలు
ప్రసరించే
నీ ఫాలభాగం
చూసిన
విషాద భరిత
నా నయనాలలో సంభ్రమాశ్చర్య మేల?
ఎర్ర గులాబీ వంటి
అధర జనిత
సన్నని చిరునవ్వు
నాలో జీవం
నాసికాంతరాలలోని
ఉఛ్ఛ్వాస నిశ్వాస ల “సోహం”చలనం..
నా ధ్యానం
నీలాల కురుల
పరదా చాటున
నీ సుందర ముఖబింబం
తేలియాడే
కారు మేఘాల
మాటున దాగిన
చంద్ర బింబమా..
శరత్జ్యోత్స్నలలో
యమునా తీరాన
శ్రీ కృష్ణుని కై వేచిన
అలౌకిక ప్రణయిని
రాధ వోలె
నా కోసం నిలిచిన
ప్రేమరూపిణివా?
పి.బాలా త్రిపుర సుందరి
P Bala Tripura Sundari,Telugu Kavithalu