2025-02-12 10:43:00.0
శాస్త్రీయ అధ్యయనం తర్వాతే కమిషన్ నివేదిక ఇచ్చింది.. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు : మంత్రి దామోదర
ప్రతి గడపకూ ఎస్సీ వర్గీకరణ ఫలితాలు చేర్చే బాధ్యత ఎమ్మెల్యేలు, నాయకులదేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, లక్ష్మీకాంతరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మందుల సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావుతో ఆయన సమావేశమయ్యారు. శాస్త్రీయ అధ్యయనం తర్వాతనే షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఇచ్చిందనే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పారు. ఎవరో సృష్టించే అపోహలను నమ్మొద్దని ఎస్సీ కులాల్లోని ప్రజలకు నచ్చచెప్పాలన్నారు. ప్రతి కులానికి న్యాయం చేసేలా వర్గీకరణ ఉందన్నారు. అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ వన్‌లో, మద్యస్తంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2లో, కొంత మెరుగ్గా ఉన్న కులాలను గ్రూప్ 3లో చేర్చాలని కమిషన్ సూచించిందన్నారు. కమిషన్ సూచించినట్టుగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా వర్గీకరణ జరుగుతోందన్నారు. మాదిగ, మాదిగ సామాజిక వర్గాల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతున్న ఈ తరుణాన్ని పండుగలా జరుపుకోవాలన్నారు. వర్గీకరణ విజయోత్సవాల్లో అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. సమావేశంలో ప్రొఫెసర్ మల్లేశం, కాంగ్రెస్ నాయకుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
SC Classification,Damodara Rajanarsimha,Scientific study. Shameem Akthar Commission