ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని కీలక భేటీలు

2024-11-19 03:17:53.0

జీ 20 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌ , బ్రిటన్‌ , ఇటలీ ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్‌ దేశాధినేతలతో సమావేశమైన మోడీ

బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మెక్రాన్‌తో చర్చ సందర్భంగా అంతరిక్షం, ఇంధన రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి పనిచేస్తామని ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఈ సమావేశాన్ని భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అభివర్ణించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్‌ ఒలింపిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించారని మెక్రాన్‌ను ప్రధాని ప్రశంసించారు.

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తోనూ మోడీ చర్చించారు. రాబోయే కాలంలోసాంకేతికత, హరిత ఇంధన, భద్రత, ఆవిష్కరణ తదితర అంశాల్లో బ్రిటన్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాం. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను కూడా బలపరచచాలనుకుంటున్నామని పేర్కొంటూ ఎక్స్‌ పోస్టులో వెల్లడించారు.

అలాగే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోడీ భేటీ అయ్యారు. ఇటలీ ప్రధానితో రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతిక అంశాల్లో సహకారం గురించి చర్చించామని పేర్కొంటూ పోస్టు పెట్టారు. ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్‌ తదితర దేశాధినేతలతోనూ ప్రధాని మోడీ చర్చలు జరిపారు. 

Modi meets,World leaders,G20 Summit,Emmanuel Macron,Keir Starmer