ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అతిథిగా శివనాగిరెడ్డి

2024-07-29 15:40:29.0

జూలై 21వ తేదీన ప్రారంభ‌మైన ఈ స‌మావేశాలు ఈనెల చివ‌రి వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, రెండ్రోజుల పాటు ఈ స‌మావేశాల్లో పాల్గొంటున్న‌ట్లు శివనాగిరెడ్డి తెలిపారు.

భారతదేశం ఆతిథ్యమిస్తూ 195 దేశాలు పాల్గొంటున్న 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలకు పురావస్తు పరిశోధకుడు, వారసత్వ పరిరక్షణ నిపుణుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డిని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అతిథిగా నామినేట్‌ చేసింది. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో పాల్గొంటున్నట్లు ఆయ‌న తెలిపారు. ఈనెల 21వ తేదీన ప్రారంభ‌మైన ఈ స‌మావేశాలు ఈనెల చివ‌రి వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, రెండ్రోజుల పాటు ఈ స‌మావేశాల్లో పాల్గొంటున్న‌ట్లు శివనాగిరెడ్డి తెలిపారు. యునెస్కో సభ్యదేశాలు, తమ దేశాలకు చెందిన పురాతన స్థలాలు, కట్టడాలు, సుందరతర ప్రకృతి ప్రదేశాలకు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కోసం పంపే ప్రతిపాదనలను ఈ సమావేశాల్లో చర్చించి, అప్పటికే తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకొన్న వాటిపై ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని, ఆసక్తికరంగా సాగే చర్చల ద్వారా, కొత్త ప్రతిపాదనల నివేదికల తయారీకి అవసరమైన నైపుణ్యాన్ని సంతరించుకొనే వీలు చిక్కిందని శివనాగిరెడ్డి చెప్పారు.

తనతో పాటు వారసత్వ నిపుణులు, వాస్తు శిల్పులు (ఆర్కిటెక్ట్‌లు) మణికొండ వేదకుమార్‌, ఎం.పాండురంగరావు, డా. శోభా, ప్రొ.కె.పి. రావు, డా. పద్మనాభలను తెలంగాణ ప్రభుత్వం నామినేట్‌ చేసిందని, తనకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, ప్రభుత్వ పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శికి శివనాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.