ప్రయాణమంటే చాలు గుండెదడ….ట్రావెల్ యాంగ్జయిటీ

https://www.teluguglobal.com/h-upload/2023/06/26/500x300_788463-travel-anxiety.webp
2023-06-26 11:59:50.0

ట్రావెల్ యాంగ్జయిటీ ఉన్నవారు….ప్రయాణం ఎలా జరుగుతుంది, వసతి సదుపాయాలు సరిగ్గా ఉంటాయా, ప్రయాణం సురక్షితంగా చేయగలమా… లాంటి ఆలోచనలతో ఉక్కిరిబిక్కరి అవుతుంటారు.

సాధారణంగా ప్రయాణాలంటే చాలామంది ఇష్టపడుతుంటారు. ప్రయాణానికి ముందునుండే, ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటినుండే ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపిస్తుంటుంది కూడా. అయితే కొంతమందికి మాత్రం ప్రయాణాలంటే భయాందోళనలు మొదలవుతాయి. సరదాగా ఏదైనా నచ్చిన ప్రదేశం చూసి రావాలన్నా వీరికి యాంగ్జయిటీ ఆటంకంగా మారుతుంది. ఈ పరిస్థితిని ట్రావెల్ యాంగ్జయిటీ, లేదా వెకేషన్ యాంగ్జయిటీ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ప్రయాణానికి ముందు లేదా ప్రయాణం చేస్తున్నపుడు ఒత్తిడికి, తీవ్రమైన అసౌకర్యానికి, ఆందోళనకు గురవుతుంటారు.

ట్రావెల్ యాంగ్జయిటీ ఉన్నవారు….ప్రయాణం ఎలా జరుగుతుంది, వసతి సదుపాయాలు సరిగ్గా ఉంటాయా, ప్రయాణం సురక్షితంగా చేయగలమా… లాంటి ఆలోచనలతో ఉక్కిరిబిక్కరి అవుతుంటారు. విపరీతమైన ఆలోచనలతో వీరికి నిద్ర పట్టదు. విశ్రాంతి తీసుకోలేరు. మెదడునిండా ప్రయాణానికి సంబంధించిన ఆలోచనలే ఉంటాయి. ప్రయాణానికి ప్లాన్ చేసుకోవటం, సిద్ధం కావటం వారికి విపరీతమైన ఒత్తిడిని, అసహనాన్ని కలిగిస్తుంది. ప్రయాణానికి సంబంధించిన తేదీలు, వివరాలు, వస్తువులను పదేపదే చెక్ చేసుకుంటూ ఉంటారు. అన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా.. అని తమతో ఉన్నవారిని అడుగుతుంటారు.

లక్షణాలు

♦ ట్రావెల్ యాంగ్జయిటీ ఉన్నవారిలో గుండెదడ, ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండవచ్చు.

♦ వాంతులు విరేచినాలు ఉండే అవకాశం ఉంది.

♦ విశ్రాంతిగా ఉండలేరు, ఏకాగ్రత ఉండదు.

♦ నిద్రపట్టదు, నిద్రలేమి సమస్యకు గురవుతారు.

కారణాలు

♦ విమాన ప్రయాణాలంటే భయం వలన కొంతమంది విమాన ప్రయాణమనగానే యాంగ్జయిటీకి గురవుతుంటారు.

♦ తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రాలేకపోవటం, పబ్లిక్ ప్రదేశాలకు వెళ్లలేని అగరోఫోబియా కలిగి ఉండటం.

♦ ప్రయాణాలకు సంబంధించిన ప్రమాదాలను గురించి విని ఉండటం, అవి మనసులో ముద్రపడిపోవటంతో భయాందోళనలు కలుగుతాయి.

♦ జన్యుపరమైన కారణాల వలన కూడా ట్రావెల్ యాంగ్జయిటీ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

♦ కుటుంబానికి స్నేహితులకు దూరంగా ఉండాలంటే భయం, అలాగే తమ దినచర్య, రోజువారీ చేసే పనులు లేకపోవటం వలన కలిగే వెలితి.

♦ తమకు తెలియని ప్రదేశాలు, వ్యక్తులంటే భయం ఉండటం వలన.

♦ రక్తంలో చెక్కర తగ్గటం, కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకోవటం, ఇంకా ఒత్తిడి వలన కూడా యాంగ్జయిటీ పెరిగే అవకాశం ఉంది.

ట్రావెల్ యాంగ్జయిటీ తగ్గాలంటే

అందుకు కారణమవుతున్న అంశాలను గుర్తించాలి. కొంతమందికి ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నపుడు యాంగ్జయిటీ పెరగవచ్చు. సాధారణంగా ప్రయాణానికి ముందు కలిగే యాంగ్జయిటీలో పలురకాల అనుమానాలు మనసుని తొలిచేస్తుంటాయి. వాటికి సమాధానం చెప్పుకోవటం ద్వారా ఆందోళనని తగ్గించుకోవచ్చు. ప్రతి నెగెటివ్ ఆలోచనకు సరైన సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ డబ్బు అయిపోతే ఏం చేయాలి… అనే భయం కలిగితే ఏ బంధువునో లేదా స్నేహితులనో అడుగుతాను… అని చెప్పుకోవాలి. ప్రయాణంలో ఆరోగ్యం పాడయితే ఎలా అనే ఆందోళన కలిగితే… ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా… అని సమాధానం చెప్పుకోవాలి. ఇలా వివిధ సందేహాలు ఆందోళనని కలిగిస్తుంటే వాటికి తగిన సమాధానం చెప్పుకోవటం వలన ఆందోళన తగ్గుతుంది.

ప్రయాణానికి అవసరమైన డబ్బు, వసతి, రూట్ మ్యాప్ లాంటి అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన ప్రశాంతంగా ఉండవచ్చు. రిలాక్సేషన్ వ్యాయామాలతో మనసులోని ఆందోళన తగ్గుతుంది. అలాగే తమకి నచ్చిన, ఇష్టమైన పనులతో కాలక్షేపం చేయటం వలన యాంగ్జయిటీ అదుపులో ఉంటుంది. ఆన్ లైన్ గేములు, నచ్చిన పుస్తకాలు, ఇష్టమైన సంగీతం… ఇవన్నీ ఆందోళనని తగ్గిస్తాయి. కొంతమందికి ఇల్లు వదిలి వెళ్లాలంటే ఆందోళన కలుగుతుంది. ఇల్లు పిల్లల బాధ్యతలు, పెంపుడు జంతువుల సంరక్షణ మొదలైన పనులను వదిలి వెళ్లాలంటే కంగారు పడతారు. వీరు తమ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవటం ద్వారా యాంగ్జయిటీని తగ్గించుకోవచ్చు. సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తే తగిన మందులను సూచిస్తారు. సైకోథెరపీతో ట్రావెలింగ్ యాంగ్జయిటీకి కారణమవుతున్న అంశాలను గుర్తించి, వాటినుండి బయటపడే మార్గాలను సూచిస్తారు.

Heart Palpitations,Travel Anxiety,Health Tips
Heart Palpitations, Travel Anxiety, Health Tips, Telugu News, Telugu Global News, Latest Telugu News,

https://www.teluguglobal.com//health-life-style/traveling-is-heart-palpitationstravel-anxiety-943305