2023-10-16 08:06:42.0
https://www.teluguglobal.com/h-upload/2023/10/16/841351-prasamsha.webp
అండం గువ్వలా ఎదిగి
అంబరాన్ని చుంబించడం
శ్లాఘనీయం
బీజం పాదపమై విస్తరిల్లి
పచ్చగా శోభిల్లడం
ప్రశంసనీయం
కుట్మలం కుసుమమై
కుశల మంది
పరిమళమై ప్రసరించడం
అభినందనీయం
వాగు తటినిలా
తారుణ్యం పొంది
రత్నాకర పరిష్వంగంలో
రాణిల్లడం
స్తవనీయం
వంశాంకురం
వంశాబ్ధి చంద్రునిగా వర్ధిల్లి
వాసికెక్కడం
అభివందనీయం
అక్షరం వాక్యమై వర్ధిల్లి
ప్రజా కావ్యమై ప్రభవించడం
ఆదర్శనీయం
ప్రాణమున్నంత కాలం
ప్రగతి కై ప్రయత్నించే
మనిషెoతో మాననీయం
-ఎ . గోపీనాథ రావు
Prashansaniyam,A Gopinatha Rao,Telugu Kavithalu