2023-09-14 12:39:38.0
https://www.teluguglobal.com/h-upload/2023/09/14/825027-priyathama.webp
క్షణం క్షణం
మనోఫలకంపై ముద్రించిన
నీ అందమైన మోము
కనువిందు చేస్తూ
హృదిలో గిలిగింతలు
పెడుతోంది.
మందహాసంతో
గులాబీలా విచ్చుకొను
నీ పెదవులు,
నీ కనులలో మెరుపు
నా మనసును మురిపిస్తున్నది
అణువణువు ఉల్లాసంతో
ఉత్తేజంతో పులకించి,
విభ్రమంగా నిన్ను అవలోకించి
నా తనువు చలిస్తోంది.
చుట్టూ పండువెన్నెల
కాస్తున్నట్లు
ఆహ్లాదంగా, అద్భుతంగా
ధారావాహికంగా,
చల్లదనం పంచుతూ,
వెలుగు విరజిమ్ముతూ,
కానరాని రహదారిలో
గమ్యాన్ని సూచిస్తూ,
నన్ను నీ చేరువకు
చేరుస్తున్న భావనతో
నా ఎద పులకించి పోతోంది.
– కాదంబరి ( చెన్నై)
Priyatama,Telugu Kavithalu