2023-10-08 09:27:15.0
https://www.teluguglobal.com/h-upload/2023/10/08/837288-priya-bhashanam.webp
వెళ్లనంటుంది శీతగాలి
పోరు పెడుతోంది వేసవి గాలి
నలిగిన రాత్రికీ,
నలిపేసే పగటికీ మధ్య
తెలివిరాని నిద్రకీ..
తెల్లారిపోయే బతుక్కీ మధ్య
కలలోకో, కలత లోకో మేల్కొన్నానా…!
కిటికీ పట్టుకు వేలాడుతూ,
చంద్రుడింకా నా పడకింట్లోకి తొంగిచూస్తూనే ఉన్నాడు
పక్కనున్న అలనాటి చందమామ,
అలికిడికి అలవాటుగా అటుతిరుగుతూ-
’ఇడ్లీపిండి ఫ్రిజ్జులోంచి తీసి పెట్టు..
చెత్తవాడొస్తాడేమో, ఆ కవర్లు బయటపెట్టు‘ అంటూనే
అలవోకగా మళ్లీ నిద్రలోకి ఒరిగింది.
కాపరం దశాబ్దాలు దాటేకా,
ఇది ప్రియభాషణ కాదనేవాడిని,
మూర్ఖుడని సరిపెట్టేయగలమా?
-దేశరాజు
(హైదరాబాద్)
Desaraju,Telugu Kavithalu