ప్రేమ కావ్యం (కవిత)

2023-02-14 13:16:27.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/14/723181-prema-kavyam.webp

చెమ్మ గిల్లిన

హృదయపు చెక్కిలిపై చెక్కిన

చక్కని

శిల్పాలము మనము

చిత్రంగా స్వప్న లోకపు

చేల గట్లపై చేతిలో చెయ్యేస్కుని బుగ్గల్లో సిగ్గురంగు పులుముకున్నాము

మంత్రంగా ప్రణయ ప్రవచనం చెప్పుకుని పరవశిoచాము

ఆత్రంగా ఒకరి కను పాపల్లో

మరొకరు పటమై నిలిచాము

చింపినా చిరగని

ప్రేమ లేఖలెన్నో రాసుకున్నాము

చెరిపినా చెరగని శాసనంలా

ప్రేమ సంతకం చేసుకున్నాము

నా వేదనలు వేయయినా

నీ మాటలతో మాయం చేసే

మంత్ర పుష్పం నీవయ్యావు

నీ నీడలా నీ వెనకే వస్తూ

నీపాద ముద్రల్లో నిద్రించి సేద దీరే మన్నవ్వాలనుకున్నాను

మారీచుడి

మాయాజాలమో ఏమో

మాటయినా చెప్పకనే

మాయయమయ్యావు

మరచి పోలేని మనసుకి

మానని గాయమయ్యావు

అనాది గా మనది ఒకే ప్రేమ

ఒకే ప్రాణం ఒకే ప్రమాణం

శ్రీరాముడి వాలకం నాది

సీతమ్మ జాతకం నీది

కల కాలం కలిసుంటామన్నది

కనికట్టు లాంటి కమ్మని కట్టుకధ

కాలం ఏదయినా ఆదర్శ ప్రేమ

మనదే నన్నది కాదన లేని

కమనీయ ప్రేమ కావ్యం

పారేసుకోలేని పాత జ్ఞాపకాలు

పదే పదే పలకరిస్తుంటే

మనం తిరిగొచ్చే తరుణం కోసం

పరితపిస్తూ తలుపులు తెరిచి

వేచి చూస్తుంది మన పర్ణశాల.

దుద్దుంపూడిఅనసూయ

(రాజ మహేంద్రవరం)

Prema Kavyam,Duddumpudi Anasuya,Telugu Kavithalu